బంగారు తెలంగాణ..  కాంగ్రెస్‌ తోనే సాధ్యం


– టీఆర్‌ఎస్‌ లో సామాన్యులకు చోటులేదు
– టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
– హుజూర్‌నగర్‌లో నామినేషన్‌ దాఖలు చేసిన ఉత్తమ్‌
– భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌, తెదేపా శ్రేణులు
నల్గొండ, నవంబర్‌17(జ‌నంసాక్షి) : నాలుగున్నారేళ్లుగా తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుతామంటూ కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తూ వచ్చాడని, సామాజి, బంగారు తెలంగాణ ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. శనివారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకు ముందు ఆయన పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీపుల్స్‌ ఫ్రంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశానని తెలిపారు. దాదాపు 70వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘నాకు పిల్లలు లేరు.. ఈ ప్రాంత ప్రజలే నాకు పిల్లలని భావించి పనిచేశానని ఉత్తమ్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ లో సామాన్యులకు చోటు లేదని ఉత్తమ్‌ విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను కాంగ్రెస్‌ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తున్నట్లు ఉత్తమ్‌ పేర్కొన్నారు. అమరుల ప్రాణత్యాగాలను చూసి చలించిపోయిన సోనియాగాంధీ ఎవరు అడ్డుపడ్డా ప్రత్యేక తెలంగాణను ఇచ్చారని అన్నారు. కానీ కేసీఆర్‌ నేనే తెలంగాణను తెచ్చానని గత ఎన్నికల సమయంలోప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చారని అన్నారు. ఏ సమస్యల పరిష్కారం కోసం అయితే తెలంగాణను సాధించుకున్నా వాటన్నింటిని విస్మరించి కేసీఆర్‌ నాలుగేళ్ల పాలన సాగిందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్లు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ వంటి పథకాలను తెచ్చి కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు, అనుచురులు అవినీతికి పాల్పడి జేబులు నింపుకున్నారని ఆరోపించారు. ప్రజలంతా తెరాస నాలుగేళ్ల పాలనను గమనించారని, మళ్లీ కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి రావటం ఖాయమని ఉత్తమ్‌ పేర్కొన్నారు. అనంతరం ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా హుజూర్‌నగర్‌లోని గణెళిశ్‌ దేవాలయం వద్ద నామినేషన్‌ పత్రాలకు పూజలు చేయించారు. అనంతరం భారీ ర్యాలీతో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వరకు వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యక్రమంలో భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.