బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది: గవర్నర్ నరసింహన్
అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో ఉభయలసభనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఈ ఏడాది వృద్ధిరేటు 5.3 శాతంగా అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు గవర్నర్ నరసింహన్. రాష్ట్రం నూతన ఒరవడిలో ప్రయాణిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ నరసింహన్.. ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలను గురించి ప్రస్తావించారు. ఇరిగేషన్ రంగానికి సర్కారు అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. మంచినీటి కోసం వాటర్ గ్రిడ్ పథకం తెచ్చినట్లు తెలిపారు. ఐటీఐఆర్ ద్వారా 50 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు చెప్పారు.
సేవారంగంలో మైనార్టీలో సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని గవర్నర్ స్పష్టం చేశారు. వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించామన్నారు. సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్త ఒరవడితో నడుస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసం కళ్యాణ లక్ష్మీ పథకం అమలులోకి తెచ్చామన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లు కేటాయించామన్నారు. సింగిల్ విండో పద్దతిలో పరిశ్రమలకు అనుమతి ఇవ్వనున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమని పంపిణీ చేస్తామన్నారు. ప్రతినియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందజేయనున్నట్లు తెలిపారు. త్వరలో విద్యుత్ సమస్యను అధిగమిస్తామని గవర్నర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వైఫై సేవలు అందజేయనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేల నిధులు రూ.1.5 కోట్లకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. కేజీ టు పీజీ ఉచిత విద్య కోసం కృషి చేస్తున్నట్లు గవర్నర్ అన్నారు.
మరోవైపు గవర్నర్ ప్రసంగం సాగుతుండగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లేందుకు విపక్ష సభ్యులు యత్నించడంతో టీఆర్‌ఎస్ నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేత రామ్మోహన్‌రెడ్డిలను టీఆర్‌ఎస్ సభ్యులు నెట్టివేశారు. దీంతో సభలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, విపక్ష సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని 15 నిమిషాల్లోపే ముగించారు.