బటన్‌ నొక్కితే తినుబండారాలు!

భారతీయ రైల్వే నూతన ప్రయోగానికి శ్రీకారం
ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆటోమేటిక్‌ ఫుడ్‌ వెండింగ్‌ మెషీన్‌
ఢిల్లీ, జూన్‌9(జనం సాక్షి ) : ప్రయాణికుల సౌలభ్యం మేరకు భారతీయ రైల్వేస్‌ నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.  ట్యాబ్లెట్‌ ఆపరేటింగ్‌తో పనిచేసే ఆటోమేటిక్‌ ఫుడ్‌ వెండింగ్‌ మెషీన్‌ను ఏర్పాటు చేసింది. కోయంబత్తూర్‌ – బెంగళూరు ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. రైల్వే ప్రయాణికులకు అవసరమయ్యే తినుబండారాలైన బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్‌/కుర్‌కురే వంటి పదార్థాలన్నీ ఈ వెండింగ్‌ మెషీన్‌ ద్వారా పొందవచ్చు. దీంతో పాటు శీతల పానీయాలు, కాఫీ, టీ, ఫ్రూట్‌ జ్యూస్‌ కూడా వచ్చే విధంగా ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసింది. ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌లోని మూడు బోగీల్లో ఈ మినీ ప్యాంట్రీ కమ్‌ డైనింగ్‌ను ఏర్పాటు చేసింది. వ్యాపారాల నిమిత్తం ప్రయాణించే వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు దీన్ని తీసుకొచ్చారు. వెండింగ్‌ మెషీన్‌ వద్ద ఉండే ట్యాబ్లెట్‌ ద్వారా ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారపదార్థాలను కొనుగోలు చేసుకోవచ్చు. ట్యాబ్లెట్‌తో తమకు కావాల్సిన పదార్థాలను ఎంపిక చేసుకొని వాటికి సరిపడా నగదు చెల్లిస్తే వెంటనే మెషీన్‌ ద్వారా తినుబండారాల ప్యాకెట్లు బయటకు వస్తాయి. కాఫీ, టీ కూడా అదేవిధంగా ఆప్షన్లు ఎంపిక చేసుకుని నగదు చెల్లిస్తే ప్రయాణీకులకు లభిస్తాయి. ప్రస్తుతం నగదు చెల్లింపు ద్వారా మాత్రమే దీన్ని నిర్వహిస్తున్నారు. త్వరలోనే నగదు రహిత చెల్లింపులు జరిగేలా ఏర్పాటు చేస్తామని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఏసీ-3టైర్‌ బోగీల్లో ఆటోమెటిక్‌ వెండింగ్‌ మెషీన్‌ ఉంది. కానీ అందులో నుంచి ప్రయాణికులు కేవలం శీతలపానీయాలు మాత్రమే పొందగలరు. ఇప్పుడు ప్రవేశపెట్టిన దాంట్లో తినుబండారాలు, కాఫీ, టీ, జ్యూస్‌ కూడా లభ్యమయ్యేలా ఏర్పాటు చేశారు.