బడిబాటకు మంచి స్పందన

ప్రైవేట్‌ దోపిడీపై భారీగా ప్రచారం

నెల్లూరు,జూన్‌9(జనం సాక్షి ): జిల్లా వ్యాప్తంగా నిరుపేద, మధ్య తరగతి ప్రజల విద్యాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం, సర్వశిక్షాభియాన్‌ ప్రత్యేకంగా ఈ ఏడాది ‘హైబ్రిడ్‌ ఆండిటీ’ కార్యక్రమానికి ప్రత్యేకంగా నిధులను కేటాయించింది.ఈ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన గదులు, భవనాలు, మౌలిక వసతులు కల్పించనున్నారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుం టున్నారు. మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు, పుస్తకాలు ఉచితంగా సకాలంలో అందేలా జాగ్రత్తలు తీసుకున్నాము. ప్రభుత్వ, దాతల సహకారంతో డిజిటల్‌ తరగతి గదులు ఏర్పాటు చేశామని సర్వశిక్షాభియాన్‌ ప్రాజెక్టు అధికారి కె.విశ్వనాధ్‌ తెలిపారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత సదుపాయాలను వివరిస్తూ పలువురు సామాజిక కార్యకర్తలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. లాభాపేక్ష మధ్య సాగుతున్న ప్రైవేటు విద్యా విధానం, ఉచితంగా సకల సదుపాయాలతో సర్కారు బడుల్లో అందిస్తున్న నాణ్యమైన విద్యను బేరీజు వేస్తూ తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ, సర్వశిక్షాభియాన్‌ నేతృత్వంలో బడిబాట కార్యక్రమాన్ని ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉపాధ్యాయులు నేరుగా తల్లిదండ్రుల వద్దకు వెళ్లి మరీ ప్రభుత్వ బడుల్లోని సౌకర్యాలు, విద్యావిధానంపై వివరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార ధోరణిలో జిల్లాలో సాగుతున్న ప్రైవేటు విద్యా విధానం జిల్లా వాసులపై తీవ్ర భారాన్నే మోపుతోంది. పాఠశాల ఫీజు నుంచి పుస్తకాలు, దుస్తులు, పరీక్ష ఫీజులు, వ్యాన్‌ ఫీజులు, వసతి గృహ ఫీజులు వెరసి ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చు తప్పడంలేదు. ఇక కార్పొరేట్‌ పాఠశాలల్లో అయితే రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షలు వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దోచుకుం టున్నారు. ఏడాదికి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలకు తల్లిదండ్రులు పెడుతున్న ఖర్చు సమారు రూ.1500 కోట్లకు పైగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో పక్కా భవనాలు నిర్మించి అర్హులు, నిపుణులైన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలలను నిర్వహిస్తోంది. దీంతో గతేడాది పదిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించగలిగారు. ఈ ఏడాది కూడా ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా భవనాలు, దాతల సహకారంతో ప్రత్యేక మెటీరియల్స్‌, డిజిటల్‌, వర్చువల్‌ తరగతి గదులను సమకూర్చుకొని విద్యా బోధన అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. సాధారణ నిధులకు అదనంగా జిల్లా వ్యాప్తంగా సర్వశిక్షాభియాన్‌ను మరింత పరిపుష్టం చేసే విధంగా ఈ నిధులను పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు వినియోగించనున్నారు.