బడిబాట పట్టకపోతే కొత్త సమస్యలు


` డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌
` కట్టుదిట్టమైన రక్షణతో స్కూళ్లు నడపాలని సూచన
జెనీవా,ఆగస్టు 12(జనంసాక్షి): పాఠశాలలు ప్రారంభించకుంటే చిన్నారుల్లో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కరోనా ముప్పు ఉన్నప్పటికీ పాఠశాలలు ప్రారంభించడానికే ప్రాధాన్యత నివ్వాలని డబ్ల్యుహెచ్‌ఓ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ అన్నారు. కరోనా వైరస్‌ ప్రభావం పరోక్షంగా విద్యారంగంపై తీవ్రంగా పడిరదని, కరోనా ఉందని చిన్నారులను ఇంటిలోనే బంధిస్తే.. వారిలో మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలన్నీ పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలలను పున్ణప్రారంభించడమే మంచిదని సూచించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులతో పాటు సిబ్బంది అందరికీ వ్యాక్సిన్‌లు తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు. భారత్‌లో కోట్ల మంది చిన్నారులు హఠాత్తుగా స్కూళ్లకు వెళ్లడం మానేశారని, దీంతో వారి చదువు బాగా దెబ్బతిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలపై మూడో వేవ్‌ ప్రభావం చూపిస్తుందని అనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు. మరో ఆరు నెలలు అప్రమత్తంగా ఉండాలని, విందులు, వినోదాలు, సమావేశాలకు దూరంగా ఉండాలని అన్నారు. వ్యాక్సినేషన్‌ ఎక్కువ మందికి ఇవ్వడం పూర్తయితే నెమ్మదిగా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా వుంటే కోవిడ్‌కు, ఇతర వ్యాధుల చికిత్సకు ఉపయోగించే విధంగా మరో మూడు రకాల ఔషధాలను త్వరలో పరీక్షించనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిరచింది. ఓ స్వతంత్ర బృందం ఎంపిక చేసిన ఈ ఔషధాలు కోవిడ్‌ బాధితులను కాపాడే విషయమై పరీక్షించనున్నట్లు తాజా ప్రకటనలో పేర్కొంది. కోవిడ్‌ బాధితుల కోసం మరింత సమర్థమైన ఔషధాలను కనుగొనడం అవసరమని డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ పేర్కొన్నారు. సోషల్‌ విూడియా కార్యక్రమంలో డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ సీనియర్‌ సలహాదారు డాక్టర్‌ బ్రూస్‌ ఐల్వార్డ్‌ మాట్లాడుతూ.. ’కోవిడ్‌ ` 19 టీకాల లభ్యత విషయంలో సంపన్న, పేద దేశాల మధ్య వ్యత్యాసం భారీగా ఉంది. ఈ అంతరాన్ని కొవిడ్‌ టీకాల ఉత్పత్తి చేస్తున్న కంపెనీల సీఈవోలు, సంబంధిత దేశాల అధినేతలు తొలగించాలి’ అని అన్నారు.