బడి విద్యార్థుల ను బాల కార్మికులగా చేసిన పాఠశాల సిబ్బంది.

తీవ్రంగా ఖండించిన సిపిఎం నాయకులు.

అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు20 ( జనం సాక్షి న్యూస్) : చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులచేత పాఠశాల సిబ్బంది పుస్తకాలు మోపించిన ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే స్థానిక పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో పుస్తకాలను పంపిణి చేసేందుకు వచ్చిన కార్గో బస్సులో నుండి పాఠశాల సిబ్బంది దగ్గరుండి మరీ పుస్తకాలను విద్యార్థులతోనే మోపించివైనం శుక్రవారం నాడు సాయంత్రం వెలుగు చూసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బడిలో చదివే విద్యార్థులతో ఎలాంటి పనులు చేయించకూడదు కానీ ఉపాధ్యాయులు విద్యార్థులతోనే హమాలీ పని చేయించడం గమనార్హం. హమాలీ కార్మికులతో చేయాల్సిన పనిని విద్యార్థులతో చేయించారు.ఈ ఘటనపై వివరాలు కోరగా పాఠశాల సిబ్బంది దురుసుగా మాట్లాడుతూ మీడియాపైన ఫైర్ అయ్యారు. ఇదే క్రమంలో సమాచారం తెలుసుకున్న స్థానిక కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాఠశాలను సందర్శించి విద్యార్థులచే పుస్తకాలు ఎందుకు మోయించారని పాఠశాల సిబ్బందిని నిలదీశారు . దీనికి బదులుగా పాఠశాల సిబ్బంది పొంతనలేని సమాధానాల తో దాటవేశారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు నేతలు మల్లేష్ శంకర్ విద్యార్థి సంఘ నాయకుడు బాల గౌడ్ మాట్లాడుతూ… బడిలో పాఠాలు చదువుకోవాల్సిన విద్యార్థులను బాల కార్మికులుగా పనిచేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. బడి పిల్లల చేత పుస్తకాలు మోయించాలని ఏమన్నా జీవో ఉందా అని సూటిగా అడిగగా సరైన సమాధానమే వారి నుండి లేదన్నారు. పైగా పిల్లలతో పుస్తకాలు మోపించడం సహజమేనని ఇదేం పెద్ద తప్పేం కాదని పాఠశాల సిబ్బంది తాము చేసిన పొరపాటును సమర్ధించుకోవడం దారుణం అని , పాఠశాల సిబ్బందికి కొంతమంది ఉన్నతాధికారుల అండదండలతోనే ఇలాంటి ఘటనల కు పాల్పడుతున్నారని అన్నారు. ఇలా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్న పాఠశాల సిబ్బంది పై తక్షణమే చర్యలు తీసుకోవాలని అలాగే మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల భవనంలో వసతులు సరిగా లేవని సుమారు 500 మంది విద్యార్థులు ఉన్న ఈ భవనంలో కిటికీ తలుపులు లేవని కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలలో నెలకొన్న సమస్యలకు సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు తీసుకొని పరిష్కారం చేయాలని కోరారు. లేనియెడల పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.