బడుగు జీవుల పెన్నిధి కాకా

` బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాటం చేసిన వెంకటస్వామి
` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్(జనంసాక్షి):చిన్ననాటి నుంచి మొదలుకొని సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం తపిస్తూ జీవితాంతం పోరాటం చేసిన మహనీయుడు జి. వెంకటస్వామి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గడ్డం వెంకటస్వామి 96వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.వెంకటస్వామి 96వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాం అన్నారు. వెంకటస్వామి కేంద్ర మంత్రిగా ,రాష్ట్ర మంత్రిగా, ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు. ప్రధానంగా కార్మికుల కోసం ఆయన ప్రత్యేకంగా చేసిన కార్యక్రమాలు, సేవలు ఆయన ప్రత్యేకంగా తెచ్చిన చట్టాలు సమాజంలోని తాడిత, పీడిత ప్రజలు కార్మికులకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి, మలి దశలో ఆయన చేసిన పోరాటం మరువలేనిది అన్నారు. వారి ఆశయాలను మార్గాలను అనుసరిస్తూ సమాజానికి మనమంతా పునరంకితం కావడమే వెంకటస్వామికి ఘనమైన నివాళులు అర్పించడమని డిప్యూటీ సీఎం తెలిపారు.
 
             
              


