బతుకమ్మ చీరెలపై అభిప్రాయ సేకరణ
హైదరాబాద్,సెప్టెంబర్24(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో చీరలు అందుకునే మహిళల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైతే ముందుగా ఆయా మండలాల్లో ప్రదర్శనకు సైతం ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ మండలంలో కనీసం ఐదు చోట్ల వీటిని ఉంచి వాటిపై మహిళల అభిప్రాయాలు సేకరించనున్నారు. మండలాల వారీగా మహిళల అభిప్రాయాలను స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు పంపిస్తారు. దీని ఆధారంగా చీరల్లో స్వల్ప మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు అందజేసే కానుకలు జిల్లాలకు చేరాయి. ఈ చీరలను భద్రపరిచేందుకు జిల్లాలోని మార్కెట్ కమిటీ యార్డులో, సీఎల్‌ఆర్ శిక్షణ కేంద్రంలోని గోదాములను అధికారులు గుర్తించారు. రేషన్ కార్డు ఉండి 18 ఏండ్లు నిండిన యువతులు, మహిళలందరికీ ప్రభుత్వం బతుకమ్మ చీరలు అందిస్తున్నది. పండుగకు ముందుగానే వీటిని ఆడపడుచులకు అందజేయాలని అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే మండలాల వారీగా వివరాలు సేకరించారు. అక్టోబర్ మొదటి వారంలో వీటిని పంపిణీ చేయాలని యోచిస్తున్నారు. చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని నియమించింది. మండల స్థాయిలో ప్రత్యేకాధికారి, ఎంపీడీవో, తహసీల్దార్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నారు. మండల, గ్రామస్థాయి కమిటీల ఎంపిక పూర్తి కాగానే గోదాముల నుంచి గ్రామాలకు చీరలను పంపిణీ చేస్తారు.