బయ్యారం ప్లాంట్‌ ఏర్పాటుపై ఆశ


నిర్మాణం కోసం పూనుకోవాలి
విద్యుత్‌ సమస్య ఉండబోదంటున్న స్థానికులు
మహబూబాబాద్‌,డిసెంబర్‌13(జ‌నంసాక్షి): బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు జరిగితే నిరుద్యగో సమస్య తీరనుందని ఈ ప్రాంత నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం దీనికి అంగీకరించినా లేకున్నా గతంలో ఇచ్చిన హావిూ మేరకు ప్రభుత్వం ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో అన్న ఆస్తి ఇప్పుడు కలుగుతోంది. టిఆర్‌ఎస్‌ మళ్లీ అధికారం చేపడుఉతన్నందున దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని వీరు కోరుతున్నారు. స్థానికంగా తమవంతుగా పూర్తి సహాయసహకారాలు అందచేస్తామని అన్నారు. ఇకపోతే ప్లాంట్‌ ఏర్పాటుకు విద్యుత్‌ సమస్య ఉందన్న వాదనలో అర్థం లేదన్నారు. తెలంగాణ పవర్‌ ప్లస్‌లో ఉందన్నారు. సిఎం కెసిఆర్‌ తీసుకుంటున్న చర్యల కారణంగా విద్యుత్‌ సమస్య రాదన్నారు. ప్లాంట్‌ ఏర్పాటుకు  775 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉంటుందని అంచనా వేశారని, ప్రస్తుతం పాల్వంచలో 950 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోందని అక్కడి నుంచి నేరుగా తీసుకోవచ్చని, ఒకవేళ అది సాధ్యంకాకపోతే బూడిదంపాడు పవర్‌ గ్రిడ్‌ను కూడా తీసుకో వచ్చన్నారు.  దేశంలో ఎక్కడ విద్యుత్తును కొనుగోలు చేసినా నిమిషాల్లో బూడిదం పాడు పవర్‌గ్రిడ్‌కు తీసుకురావచ్చని, తద్వారా 20 కిలోవిూటర్లు విద్యుత్తు లైన్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే బయారానికి, బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌కు విద్యుత్తు సమస్య ఉండదని చెప్పుకొచ్చారు. ఇక రైలు మార్గం కూడా నాలుగు కిలోవిూటర్ల దూరంలోనే ఉందన్నారు. డోలమైట్‌, బైరటీస్‌, ఇనుములను కరిగించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న పరిశ్రమలు కూడా పక్కనే పది కిలోవిూటర్ల దూరంలోనే ఉన్నాయన్నారు.
బయ్యారం స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుతో కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలు అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అన్నారు.  అంతేకాకుండా పదిహేను వేలమందికి ప్రత్యక్షంగా, ఇరవై ఐదు వేల మందికి పరోక్షకంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇనుము ఆధారిత పరిశ్రమలు బయ్యారం పరిసర ప్రాంతాలలో విరివిగా ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని స్థానికులు కూడా  పేర్కొంటున్నారు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌  ఏర్పడితే దేశంలో నవరత్నాల్లో ఒకటి కాగలదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల విభజన ఒప్పందంలో కేంద్రం ప్లాంట్‌ ఏర్పాటుకు అంగీకరించిందని గుర్తుచేశారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం , మహబూబాబాద్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో సుమారు 545 హెక్టార్లలో ఐరన్‌ ఓర్‌ ముడి ఖనిజం విస్తరించి ఉందని తెలిపారు. సుమారు 12 వేల కోట్ల టన్నుల ముడి ఖనిజం బయ్యారం అటవీ ప్రాంతంలో విస్తరించి ఉందన్నారు. ముడి ఖనిజం క్వాలిటీ 50 ప్లస్‌ అయి ఉందని ఇదివరకే సర్వే ఆఫ్‌ ఇండియా నిగ్గు తేల్చిందని స్పష్టం చేశారు. ప్లాంట్‌ ఏర్పాటుకు 225 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, కాలుష్యాన్ని తట్టుకునేందుకు సహజ సిద్ధమైన అడవులు ఉన్నాయని తెలిపారు. ప్లాంట్‌ ఏర్పాటు జరిగితే రెండు టీఎంసీల నీరు అవసరం ఉంటుందని ఇదివరకే సర్వే చేశారని, బయ్యారం చెరువును బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌ చేస్తే ఆ సమస్య అధిగమించవచ్చని తెలిపారు. అదికాకపోతే అలిగేరు, ఇతర నీటి వనరులపై దృష్టిసారించవచ్చని తెలిపారు.