బలమైన ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలుపుతాం: డిసిసి

నల్లగొండ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా ఉన్నవారిని కాంగ్రెస్‌ బరిలో దింపుతుందని డీసీసీ అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్‌ అన్నారు. శాసనమండలి పట్టభద్రుల, స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని అన్నారు. నలుగురు పోటీకి సిద్ధంగా ఉన్నారని, గెలిచే సత్తా ఉన్న వారికి పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తామన్నారు.  జిల్లాలోని కాంగ్రెస్‌ కమిటీలు, పార్టీ అనుబంధ సంఘాల కమిటీలు ఈనెల 20న రద్దు చేస్తున్నట్లు బిక్షమయ్య ప్రకటించారు. నెల రోజుల వ్యవధిలో డీసీసీ, అన్ని అనుబంధ సంఘాలకు నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనుభవం ఉండి పార్టీకి అంకితభావంతో పనిచేసే నాయకులకు కార్యవర్గాల్లో చోటు కల్పిస్తామన్నారు.  గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్ఠ కార్యవర్గాన్ని నియమించి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఇదిలావుంటే నాగార్జునసాగర్‌ నీటి విడుదల విషయమై ఇరు రాష్టాల్ర ముఖ్యమంత్రులు చీకటి ఒప్పందాలతో రైతులను మోసం చేశారని అన్నారు. రెండు నెలల నుంచి కొనసాగుతున్న నీటి వివాదాన్ని ఒక్కరోజులో ఎలా పరిష్కరించారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో పొలాలు ఎండే పరిస్థితి నెలకొందన్నారు. సాగర్‌ కాలువల కింద వారబందీ పద్ధతి ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన పాలనాతీరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజల కోసం కాకుండా కుటుంబం కోసం పాలన సాతున్నతీరు దౌర్భాగ్యమన్నారు.  రైతుల పక్షాన జిల్లాలో పార్టీ కిసాన్‌సెల్‌ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి రైతు ఉద్యమాన్ని చేపడుతున్నామని చెప్పారు. కూతురికి సచివాలయం తరలింపు, కుమారుడికి వాటర్‌గ్రిడ్‌ పథకం, అల్లుడికి మిషన్‌ కాకతీయ పథకాల్ని అప్పగించి ఆయన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తీర్చిదిద్దుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాకో నిమ్స్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేశామని ఉన్న నిమ్స్‌ను ఎయిమ్స్‌కు అప్పగించి చేతులు దులుపుకున్నారని అన్నారు. కేవలం ప్రకటనలతో సరిపుచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల పేరిట ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గారడీ చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రజలకు లబ్దిచేకూరిన పథకాలను కొనసాగించకపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోందన్నారు. ప్రజల్ని వేదనకు గురిచేయవద్దని వారిని ఆత్మహత్యలవైపు ప్రోత్సహించవద్దని అన్నారు.

తాజావార్తలు