బస్టాండ్లలో తప్పని పడిగాపులు

సొంతూర్లకు వెళ్లాలనుకున్న వారికి భంగపాటు

ఉదయమే వచ్చినా కిక్కిరిసిన బస్సులు

సంక్రాంతికి వెళ్లలేక నానా అవస్థలు

హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లాలన్న ప్రజలకు బస్సులు దొరక్క నానాయాతన పడ్డారు. సోమవారం కూడా బస్సుల కోసం వేకువ జామునుంచే బస్టాండ్ల వద్దకు వచ్చినా చేరాల్సిన గమ్యానికి బస్సులు దొరక్క ఇబ్బందులు పడ్డారు. తమ స్వగ్రామాలకు తరలివెళ్తున్న ప్రయాణికుల రాకతో జూబ్లీ బస్‌స్టేషన్‌,ఇమ్లిబన్‌, దిల్‌సుఖ్‌ నగర్‌ బస్టాండ్‌ పరిసరాలు కిటకిటలాడాయి. నగరవాసులు కుటుంబ సమేతంగా పండుగకు తమ ఊళ్లకు వెళ్తుండడంతో సందడి వాతావరణం నెలకొంది. అధికారులు ముందుగా అనుకున్నట్లుగానే రద్దీకి అనుగుణంగా కరీంనగర్‌, నిజామాబాద్‌, అదిలాబాద్‌, మెదక్‌ సెక్టార్లలోని వివిధ ప్రాంతాలకు రోజువారి సర్వీసులతోపాటు అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ వైపు ప్రత్యేక బస్సులు నడిపారు. కర్నూలు రూట్లో కూడా బస్సులు నడిపారు.సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో ఎంజీబీఎస్‌, సీబీఎస్‌లు కిటకిటలాడుడాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆర్టీసీ 3400 రెగ్యులర్‌ బస్సులతో పాటు యాభై శాతం అదనపు ఛార్జీలతో 5252 ప్రత్యేక బస్సు సర్వీసుల్ని ఏర్పాటు చేసింది. అన్ని బస్సులు ఎంజీబీఎస్‌ నుంచే నడపడం వల్ల తరచూ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతుండటంతో ఆర్టీసీ అధికారులు గత కొన్నేళ్లుగా ఎంజీబీఎస్‌తో పాటు జేబీఎస్‌, నగర శివారు ప్రాంతాలైన దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌.బి.నగర్‌, ఉప్పల్‌, ఈసీఐఎల్‌, ఆరాంఘర్‌, మెహిదీపట్నంలతో పాటు ఆర్టీసీ అధీకృత ఏజెంట్లకు కేటాయించిన ప్రాంతాల వద్ద నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం సెలవుదినమైనప్పటికీ ప్రయాణికుల రద్దీతో ఎంజీబీఎస్‌, సీబీఎస్‌లు కిక్కిరిసిపోయాయి. ఆంధ్రదేశ్‌లోని కొన్ని జిల్లాలకు కాచిగూడతో పాటు సీబీఎస్‌ హ్యాంగర్‌లనుంచి బస్సులు ఏర్పాటు చేశారు. సమాచార లోపం వల్ల ఎంజీబీఎస్‌కు వచ్చే ప్రయాణికులను నిర్దేశిత ఆయా ప్రాంతాలకు చేరవేసేందుకు ఆర్టీసీ ఎంజీబీఎస్‌ నుంచి మినీ బస్సులతో పాటు సెట్విన్‌ బస్సులను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల సౌలభ్యం కోసం సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా సెక్టార్లకు ప్రతిరోజు 1053బస్సులు రాకపోకలు సాగిస్తు సుమారు 50వేలమందిని తమ గమ్య స్థానాలకు చేరుస్తుంటాయి. పండుగ సందర్భంగా రోజువారీ సర్వీసులతోపాటు ఈ నెల 11న కరీంనగర్‌ సెక్టార్‌లోని వివిధ ప్రాంతాలకు అదనంగా 188, ఆదిలాబాద్‌కు 28, మెదక్‌కు 3, నిజామాబాద్‌ సెక్టార్‌లోని వివిధ ప్రాంతాలకు 76 మొత్తం 295 అదనపు బస్సులను ఏర్పాటు చేయగా, 12వ తేదీన కరీంనగర్‌కు 204, ఆదిలాబాద్‌కు 96, మెదక్‌కు 162, నిజామాబాద్‌కు 85 మొత్తం 547 అదనపు సర్వీసులను నడిపించామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉందని, రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేసేందుకు సిద్ధగా ఉన్నట్లు పికెట్‌ డిపో అధికారులు పేర్కొన్నారు.