బాండ్ల జారీతో మున్సిపాలిటీలకు నిధులు : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : దేశంలో మౌలిక సదుపాయాల కొరతను అధిగమించాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు. మున్సిపాలిటీలు బాండ్లు జారీ చేయడం ద్వారా నిధులు సమకూర్చుకోవచ్చన్నారు.మూలధన మార్కెట్‌లో బాండ్లు జారీచేయడం ద్వారా నిధులు సమకూర్చుకునేందుకు మున్సిపాలిటీల జాబితా కోసం తమ మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోందని చెప్పారు. ”దేశంలో బాండ్లు జారీ చేసే స్థితిలో ఉన్న మున్సిపాలిటీల జాబితా తయారీ ప్రక్రియను ఓ సంస్థకు అప్పగించాం. మున్సిపల్‌ బాండ్లకు ప్రపంచవ్యాప్తంగా మంచి మార్కెట్‌ ఉంది.. మన దగ్గర మాత్రం వాటిని వాడుకోవడం లేదు” అని కమల్‌నాథ్‌ పేర్కొన్నారు. సోమవారమిక్కడ ఓ సదస్సులో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలు బాండ్ల జారీతో పాటు వాటి పరిధిలోని నిరుపయోగమైన భూముల ద్వారానూ వనరులు సృష్టించుకోవాలన్నారు. పట్టణీకరణ వేగంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో నిర్ణీత సమయంలో చర్యలు చేపట్టకుంటే మౌలికవసతుల కొరత తీవ్రమవుతుందని చెప్పారు. పట్టణాల్లో మౌలికసడుపాయాల కొరత తీవ్రంగా ఉందన్నారు. పట్టణ నీటిపారుదల, పారిశుద్ధ్య రంగంలో భారీస్థాయిలో పెట్టుబడుల అవసరం ఉందని కమల్‌నాథ్‌ చెప్పారు.