బాధితులకు అండగా నిలుద్దాం : కేసీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలుద్దామని కేసీఆర్‌ కోరారు. బాంబు దాడిలో గాయపడి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉగ్రవాదుల చర్యలపైనా, దిల్‌సుఖ్‌నగర్‌ ఘటనపై అంతర్జాతీయస్థాయిలో చర్చలేవనెత్తేందుకు పాలకులు ప్రయత్నించాలని ఆయన సూచించారు. ప్రధానంగా క్షతగాత్రులను ఆదుకోవడంలో కేర్‌ ఆస్పత్రి చూపించిన చొరవ, మానవత్వం అత్యంత అమోఘమన్నారు. మానవత్వంతో వీలైనంతమందికి ఉచితంగా సేవలందిస్తూ నిత్యం క్షతగాత్రులను ఆస్పత్రులకు చేరవేసేందుకు అంబులెన్స్‌లను అందించడం హర్షించ తగ్గ విషయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వవైఫల్యాలు, సీసీ కెమెరాల తీరుపై మీడియా అడిగిన ప్రశ్నలను ఆయన కొట్టిపారేశారు. కేవలం రాజకీయం కోసం మాత్రమే పనిచేస్తాయన్నారు.