బాధ్యతాయుతంగా సేవలందిస్తా : శోభానాగిరెడ్డి
కర్నూలు, జూన్ 16 (జనంసాక్షి) : ఆళ్లగడ్డ నియోజకవర్గ ఓటర్లు తాను ఊహించని విధంగా మెజార్టీతో గెలిపించడం పట్ల నియోజకవర్గ ప్రజలకు చేరువలో ఉంటూ సేవలందిస్తానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. శనివారం నాడు విలేకరులతో మాట్లాడుతూ, పలు విషయాలు వెల్లడించారు. పక్షపాత బుద్ధితో కిరణ్ ప్రభుత్వం ఆళ్లగడ్డ నియోజవర్గానికి నిధులు విడు దల చేయలేదని ఆమె విమర్శించారు. పైగా ఉప ఎన్నికల సందర్భంలో తానే విడుదల చేయలేదని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేదా ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేసి బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదని మరోసారి ఓటర్లు తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును రెఫరెండంగా తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంతైనా విశ్వాసం పెరుగుతుందని అన్నారు. వైఎస్‌ఆర్ తెచ్చిన ప్రభుత్వంతో మంత్రి పద వులను వదలకుండా కూర్చునారని దీనిపై ప్రజావ్యతిరేక తీర్పు వచ్చినప్పటికీ కుర్చిలు వదలకుండా జగన్‌ను విమర్శించడం ఏమిటని ఆమె ఎద్దేవా చేశారు. నిజానికి నిజాయితీగా విచారణ జరుపుతున్నారా, కాంగ్రెస్ విచారణ చేయమని తెలుసుకునేందుకు సిబిఐకి నార్కో పరీక్షలు చేయాలని ఆమె ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.