బాధ్యులపై చర్యలు తీసుకోండి

3
– షుకూర్‌ బస్తీలో రాహుల్‌ పర్యటన

న్యూఢిల్లీ,డిసెంబర్‌14(జనంసాక్షి): ఢిల్లీలోని షాకూర్‌ బస్తీలో గుడిసెల కూల్చివేతతో ఆశ్రయం కోల్పోయిన బాధితులను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరామర్శించారు. మురికివాడలో పర్యటించిన ఆయన ప్రభుత్వ తీరును ఖండించారు. దీనికి బాధ్యులపై చర్య తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాయి.  ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ పార్లమెంట్‌లో ఎందుకు ఆందోళన చేపడుతోందని రాహుల్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అస్సాం పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు తనను గుడిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని రాహుల్‌ ఆరోపించారు. పంజాబ్‌లోనూ దళితుల పట్ల బీజేపీ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందన్నారు. కేరళలో ఆ రాష్ట్ర సీఎం ఒమెన్‌ చాంఢీనీ ప్రధాని మోదీ అవమానపరిచారన్నారు. ఆ రాష్ట్ర మాజీ కాంగ్రెస్‌ నేత ఆర్‌. శంకర్‌ విగ్రహావిష్కరణకు సీఎం ఒమెన్‌ చాంఢీని ఆహ్వానించకపోవడంపై రాహుల్‌ సీరియస్‌ అయ్యారు. కేరళ ప్రజల మనోభావాలను మోదీ కించపరిచారన్నారు.కాంగ్రెస్‌ నేత వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ కూడా స్పందించారు. రాహుల్‌ పిల్లవాడని, రైల్వే శాఖ కేంద్రం పరిధిలో ఉంటుందన్న విషయం ఆయనకు తెలియదని కేజ్రీ విమర్శించారు. గుడిసెలు కూల్చివేసిన ఘటనలో ఓ చిన్నారి ప్రాణం కోల్పోయిన విషయం తెలిసిందే. ఢిల్లీలో అక్రమ గుడిసెల కూల్చివేత వ్యవహారం ఢిల్లీ సర్కార్‌, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మరో కొత్త వివాదాన్ని సృష్టించింది. పశ్చిమ ఢిల్లీలోని షకూర్‌ బస్తీలోని మురికివాడల్లో ఉన్న అక్రమ గుడిసెల తొలగింపులో రైల్వే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం ఆరునెలల చిన్నారి మృతికి కారణమైంది.ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి కారణమైన వారిపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితులకు సరైన వసతి, ఆహారాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైన ఇద్దరు సబ్‌ డివిజనల్‌ మేజిస్టేట్ల్రు, మరో సీనియర్‌ అధికారిపై సిఎం కేజ్రీవాల్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు.  దాడులకు పాల్పడిన అధికారుల జీతం నుంచి కోత పెట్టి.. బాధితులకు పరిహారం అందజేయాలని, చిన్నారి మృతికి కారణమైన వారిని దేవుడు కూడా క్షమించడని కేజీవ్రాల్‌ ట్వీట్‌ చేశారు. మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా దాదాపు 1200 అక్రమ గుడిసెలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఇదిలావుంటే ఆక్రమణల తొలగింపునకు ముందే చిన్నారి మృతి చెందిందని రైల్వే అధికారులు తెలిపారు. బట్టల మూట విూద పడటంతోనే పసిపాప మరణించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని నైరుతి ఢిల్లీ జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ దీపేంద్ర పాథక్‌ తెలిపారు. కాగా, షకూర్‌ బస్తీ మానవులు నిర్మించిన ఓ నరకం అని ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మాలివాల్‌ అన్నారు. ఢిల్లీలో గుడిసెల కూల్చివేయడం మతిలేని చర్య అని సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్మార్ట్‌సిటీలపై ఉపన్యాసాలిచ్చే ముందు నగర పౌరులకు భద్రత కల్పించాలని కేంద్రానికి సీపీఏం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సూచించారు.