బాపూజీకి ఘన నివాళి

అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్ద
సీఎం కిరణ్‌, స్పీకర్‌ నాదెండ్ల, మండలి చైర్మన్‌ చక్రపాణి,
బాపూ ఘాట్‌ దగ్గర కోదండరాం

జాతిపిత మహాత్ముడికి యావత్‌ భారతం ఘనంగా నివాళులర్పించింది. ఆయన భారత జాతికి చేసిన సేవలను స్మరించుకుంది. మహాత్ముడి బాటలోనే నడుస్తామని ప్రతిన బూనింది. మంగళవారం గాంధీజయంతి సందర్భంగా రాజధాని ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా జాతిపితకు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద ప్రముఖులు సహా పలువురు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాజ్‌ఘాట్‌ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు రాజ్‌ఘాట్‌కు వచ్చి మహాత్ముడికి ఘనంగా నివాళులర్పించారు. కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ తదితరులు రాజ్‌ఘాట్‌ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ గీతాలు ఆలపించి, మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు.
హైదరాబాద్‌లొ: జాతిపిత మహాత్మాగాంధీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు. బాపూ 143వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలుకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. గాంధీ సేవలను స్మరించుకుంటూ.. పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో పలువురు ప్రముఖులు జాతిపితకు ఘనంగా నివాళులు అర్పించారు. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఘాట్‌ వద్ద పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ, మంత్రులు రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్‌, ఎంపీలు చిరంజీవి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు, పోలీసు కమిషనర్‌ అనురాగ్‌శర్మ తదితరులు కూడా నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో వారు పాల్గొన్నారు. బాపూజీ జీవిత చరిత్రను వివరిస్తూ.. ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అనంతరం గవర్నర్‌, సీఎం మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన మార్గాల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఆయన జీవితం మనందరికీ ఆదర్శప్రయామని అన్నారు. అటు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కూడా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌, మండలి చైర్మన్‌ చక్రపాణి, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రులు శ్రీధర్‌బాబు, శైలజానాథ్‌, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాంధీ విగ్రహం పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. గాంధీభవన్‌లోనూ ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు బాపూజీకి నివాళులు అర్పించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మహాత్ముడికి ఘనంగా నివాళులర్పించారు. ఉదయం సికింద్రాబాద్‌ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. గాంధీ సేవలను ప్రస్తుతించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేపట్టిన పోరాటాన్ని కీర్తించారు. అహింసాయుత పద్దతిలో స్వాతంత్య్రం సంపాదించారని కొనియాడారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని ధ్వజమెత్తారు. పేదల కోసం పాటు పడతానని బాబు హావిూ ఇచ్చారు. బాపూజీ చూపిన బాటలో నడుద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుకొని ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీ మేకపాట రాజమోహన్‌రెడ్డి, తదితరులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పులివెందులలో ఉన్న పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.