బాబుకు ఓటమి భయం పట్టుకుంది

అందుకే కెసిఆర్‌పై అనవసర ఆరోపణలు: గుత్తా
నల్లగొండ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  ఓటమి భయంతోనే చంద్రబాబు కేసీఆర్‌పై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఏపీ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ పేర్లు వింటేనే చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం తన నివాసంలో 39 మందికి రూ.14.17 లక్షల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల్ని ఎంపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు టీఆర్‌ఎస్‌ సమాన దూరం పాటిస్తుందని గుత్తా  స్పష్టం చేశారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు ఆరాటపడుతున్నారని, ఆయన దుష్టపాలనకు రోజులు దగ్గరపడ్డాయని గుత్తా పేర్కొన్నారు.వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తారని సర్వేలు చెబుతున్న విషయాన్ని గుత్తా గుర్తు చేశారు. మోసపూరిత వాగ్దానాలు ఇచ్చే విషయంలో చంద్రబాబుకు నోబెల్‌ బహుమతి ఇవ్వొచ్చునని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్న కుటిల ప్రయత్నాలను ఏపీ ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.