బాబు దారి పొడవునా క’న్నీటి’ధార

బాబుకు మోకాళ్ల నొప్పులు.. తారు రోడ్డుపై నడవద్దన్న డాక్టర్లు
మట్టిరోడ్డుపై నడక.. దుమ్మురేగకుండా నీటిధార
కరవు ప్రాంతంలో కొత్త కష్టాలు
రోజుకు లక్షానలభై వేల లీటర్ల నీరు రోడ్డుపాలు
కరీంనగర్‌, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రాంతాన్ని పీల్చిపిప్పి చేసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తూ కూడా ప్రజలను వదలడం లేదు. ఆయనకు వచ్చిన మోకాళ్ల నొప్పులు కరువు నేలలో రైతుల పంటలకు నీరందకుండా చేస్తోంది. ఉన్న కొద్దిపాటి నీటిని తెలుగు తమ్ముళ్లు, చంద్రదండు దౌర్జన్యంగా ఎత్తుకెళ్తుంటే రైతులు బిత్తరపోయి చూస్తున్నారు. ఆయనను ఎవరు పాదయాత్ర చేయమన్నారో? తమ నీటిని ఎందుకు ఎత్తుకెళ్తున్నారో తెలియడం లేదని అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిన చందంగా బాబు యాత్ర రైతులకు అష్టకష్టాలు తెచ్చిపెడుతోంది. ఆదిలాబాద్‌ జిల్లాలోంచి బాదన్‌కుర్తి వంతెన మీదుగా బాబు జిల్లాలో అడుగుపెట్టింది మొదలు ఆయన అనుచరుల జలదోపిడీ మొదలైంది. ఆయనకు మోకాళ్ల నొప్పులు రావడంతో తారు రోడ్డుపై నడవొద్దని డాక్టర్లు సూచించారు. మట్టిరోడ్డుపై నడవాలని సూచించారు. లేకుంటే మోకాళ్లకు సర్జరీ తప్పదని హెచ్చరించారు. అప్పటి నుంచి ఆయన యాత్ర చేస్తున్న మార్గంలో దుమ్ము లేవకుండా నీళ్లు చల్లే ప్రక్రియకు తెరలేపారు. ఆయన పాదయాత్ర చేస్తున్న మార్గంలో ఉన్న రైతులను ముందస్తుగా స్థానిక టీడీపీ నాయకులు సంప్రదిస్తున్నారు. వారు స్వచ్ఛందంగా నీరందించేందుకు ఒప్పుకుంటే సరి లేకుంటే తమ విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ ట్యాంకర్లను బావుల వద్దకు తీసుకొచ్చి మరీ నీళ్లు నింపుకెళ్తున్నారు. ఇలా ఒక్కో రోజు బాబుయాత్ర మార్గంలో 14 లారీలు, ట్యాంకర్ల ద్వారా లక్షా నలభై వేల లీటర్ల నీటిని తరలించి రోడ్డుపై చల్లుతున్నారు. నీటిని తెచ్చేందుకు పంటచేలను కూడా వాహనాలతో ఇష్టం వచ్చినట్లుగా తొక్కేస్తున్నారు. వీరి దౌర్జన్యాన్ని ప్రశ్నించే ధైర్యం లేక రైతులు మౌనంగా రోదిస్తున్నారు. ఎకరాల పంట చేలను తడిపే నీటిని టీడీపీ నేతలు దౌర్జన్యంగా దోపిడీ చేస్తూ వస్తున్నా మీకోసం అనడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార దాహంతో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఇప్పుడే ఇంత దారుణానికి ఒడిగడుతుంటే గద్దె ఎక్కిన తర్వాత తెలంగాణ ప్రాంతం పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా బాబు దండు దౌర్జన్యం ఆపాలని పలువురు కోరుతున్నారు