బాబు నాలుగేళ్ల పాలనపై చార్జిషీట్ పెడతాం
దీక్షలపేరుతో ఇతర పార్టీలను విమర్శిస్తున్నారు
చంద్రబాబు, జగన్ లాలూచీ రాజకీయాలతో ఏపీ కోలుకోలేకపోతుంది
9న పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆందోళన
విలేకరుల సమావేశంలో వామపక్ష నేతలు
విజయవాడ, జూన్7(జనం సాక్షి) : నవ నిర్మాణ దీక్షల పేరుతో టిడిపి రాజకీయం చేస్తోందని సిపిఎం, సిపిఐ నేతలు మధు, రామకృష్ణ విమర్శించారు. అమరావతిలోని దాసరి భవన్లో గురువారం జరిగిన విూడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. దీక్షల పేరుతో ఇతర పార్టీలపై దుమ్మెత్తిపోస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ధనంతో దీక్షలు చేస్తూ విపక్షాలను విమర్శించడం విడ్డూరమన్నారు. సవాళ్లు, ప్రతిసవాళ్లతో నవ నిర్మాణ దీక్షలు జరుగుతున్నాయని అన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై చార్జిషీట్ పెడతామని తెలిపారు. చంద్రబాబు, జగన్ లాలూచీ రాజకీయాలతో ఎపి కోలుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. ఎపిలో అవినీతి పాలన సాగుతోందని మధు, రామకృష్ణ ఆరోపించారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల 13 జిల్లాల రాష్ట్ర నాయకత్వానికి ఈనెల 20న విజయవాడ సిద్దార్థ కాలేజీ గ్రౌండ్లో రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు జనసేన కార్యకర్తలు కూడా హాజరవుతారని తెలిపారు. ఈనెల 9న పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరశిస్తూ విజయవాడలో చేపట్టే ఆందోళన కు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, లారీ, టాక్సీ ఓనర్లు పాల్గొంటున్నట్లు వివరించారు.