బాసరకు పోటెత్తిన భక్తజనం
మూలానక్షత్రం కారణంగా భారీగా అక్షరాభ్యాసాలు
నిర్మల్,అక్టోబర్5 (జనంసాక్షి): బాసర సరస్వతీ ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. బాసరలో ఏడవ రోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాళరాత్రి అవతారంలో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మూల నక్షత్రం కావడంతో వేకువజామున
3 గంటల నుంచి భక్తులు బారులు తీరారు. అర్చకులు చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు నిర్వహించారు.
అమ్మవారి దర్శనానికి, అక్షరాభ్యాస పూజలకు భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం మూల నక్షత్రం దివ్యముహూర్తాన తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు కిచిడీ ప్రసాదాన్ని అందచేశారు. మూలానక్షత్రం రోజు అక్షరాభ్యాసం మంచిదన్ననమ్మకంతో ప్రజలు భారీగా తరలివచ్చారు. అయితే ఆర్టీసీ సమ్మె కారణంగా భక్తుల రద్దీ తగ్గిందని ఆలయ అధికారులు తెలిపారు.