బాసరలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

కాళరాత్రి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు
నిర్మల్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు  వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం  కాత్యాయినీ రూపంలో కనిపించిన జ్ఞాన సరస్వతి అమ్మవారు మంగళవారం కాళరాత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి దర్శనం శుభప్రదంగా భావిస్తున్న భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తున్నారు. అమ్మవారికి వేద పండితులు వేకువజామున నుంచే సుప్రభాత సేవ, మంగళహారతితో పాటు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని.. తమ చిన్నారులకు అక్షరాభాస్యం చేస్తున్నారు. నవరాత్రి ఉత్సావాల్లో అమ్మవారి చెంత చిన్నారులకు అక్షరాభాస్యం చేయడం శుభప్రదమని భక్తుల విశ్వాసం. భక్తుల రద్దీకి తగినట్లుగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల కారణంగా బాసర ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. అర్థరాత్రి 2 గంటల నుంచే భక్తులు బారులు తీరారు. చిన్నారులకు పెద్దఎత్తున అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి చిన్నారులకు అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే అమ్మవారి వేదపారాయణం నిర్వహణ చేపట్టారు. రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  అటు రైల్వే స్టేషన్‌లో భక్తుల సందడి కనిపించింది. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేష ఆకట్టుకున్నాయి. ఇకపోతే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలతో మండపాలు, ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  జిల్లావ్యాప్తంగా మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన పూజలు చేశారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాలు పఠించారు. హారతి అనంతరం తమ సౌభాగ్యం కలకాలం ఉండాలని అమ్మా భవానీని వేడుకున్నారు.