బాసరలో నేటినుంచి ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
నిర్మల్,అక్టోబర్9(జనంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా జరుగనున్నాయి. చదువులతల్లి సరస్వతి దేవీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇస్తున్నారు. ఈ సందర్భంగా బాసర ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. చిన్నారులకు పెద్దఎత్తున అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి చిన్నారులకు అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే అమ్మవారి వేదపారాయణం నిర్వహణ చేపట్టారు. ఉదయం 9 గంటలకు అమ్మవారి మహా చండీయాగం. మధ్యాహ్నం 12 గంటలకు మహా నివేదన చేపడతారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటాన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అటు రైల్వే స్టేషన్‌లో భక్తుల సందడి కనిపించింది. బాసర సరస్వతీ అమ్మవారిని మూల నక్షత్రంలో దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నక్షత్రం నవరాత్రుల్లో రావడం విశేషం. బాసరకు వేలాది మంది భక్తులు తరలి రానున్నారు. ఇందు కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు తమ చిన్నారులకు పెద్ద సంఖ్యలో అక్షరశ్రీకారాలు జరిపించనున్నారు. ఇకపోతే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలతో మండపాలు, ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన పూజలు చేస్తారు.