బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి ఘటనపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి.
బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు కనీస వసతులు లేక, నాసిరకం భోజనాలతో మృత్యువాత పడుతున్నారని, అందుకు కారణమైన వ్యక్తులపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ కళాశాలలో బోధన సిబ్బంది కొరత, నాసిరకం భోజనం, రెగ్యులర్ వీసీ లేకపోవడంతో విద్యార్థులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోకపోవడం విద్యార్థుల మీద ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్ధమైనదన్నారు. ఇటీవల కాలంలో 300 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్, కలుషిత నీటితో అస్వస్థతకు గురైన ఘటనలో కొంతమంది అస్వస్థతకు గురై కొలుకోగా ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన సంజయ్ కిరణ్ అనే విద్యార్థి మృత్యువాత పడడం శోచనీయమన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించి నిజానిజాలు నిగ్గుతేల్చి ఈ ఘటనకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇప్పటికే సంజయ్ కిరణ్ కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, మారోజు రాజ్ కుమార్, శివరాజ్, గొబ్బిళ్ళ అనిల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.