బిజెపికి పాలమూరు సెంటిమెంట్
నేడు ప్రధాని మోడీ బహిరంగ సభ
బిజెపి నుంచి బరిలో ఇద్దరు మహిళా సభ్యులే
జింతేందర్ రెడ్డి రాక అదనపు బలమన్న నేతలు
మహబూబ్‌నగర్,మార్చి28(జనంసాక్షి): పాలమూరును సెంటిమెంట్ ప్రాంతంగా భావించే బిజెపి అధిష్ఠానం ఈ ప్రాంతంపై ప్రత్యేకదృష్టి సారిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 29వ తేదీన మహబూబ్‌నగర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. మోడీ సభ కోసం బిజెపి శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికితోడు జిల్లాలోని రెండు స్థానాల నుంచి బిజెపి మహిళా అభ్యర్థులనే పోటీకి దింపడం కలసి వస్తుందని భావిస్తున్నారు. పాలమూరులో డికె ఆరుణ, నాగర్ కర్నూలులో బండారు శృతి పోటీ చేస్తున్నారు. ప్రస్తుత సిట్టింగు ఎంపీ జితేందర్‌రెడ్డి భాజపాలోకి వెళ్లడం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణను భాజపాలోకి తీసుకురావడంలో అధిష్ఠానం విజయవంతం అయ్యింది. ఆమెకు సొంత బలంతోపాటు పార్టీ కేడర్ తోడవడంతో గెలుపు అవకాశాలపై బిజెపి విశ్వాసంతో ఉంది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మహబూబ్‌నగర్ స్థానంపై ప్రత్యేక దృష్టిని పెట్టారు. ఎలాగైనా పాలమూరు నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. నాగర్‌కర్నూలు
స్థానంలోనూ కమలం గట్టిపోటీ ఇచ్చేలా అధిష్ఠానం వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఇక్కడి నుంచి భాజపా మాజీ జాతీయ అధ్యక్షుడు దివంగత బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శ్రుతిని పోటీలో నిలిపారు. డీకే అరుణ భాజపాలో చేరడంతో గద్వాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో ఉన్న ఆమె అనుచరులతో శ్రుతికి మద్దతు పెరిగే అవకాశం ఉంది. ఇదిలావుంటే మహబూబ్‌నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెరాస సిట్టింగు ఎంపీ జితేందర్‌రెడ్డి తిరిగి బిజెపిలోకి రావడాన్ని స్వాగతిస్తున్నా మని పార్టీ రాష్ట్రకార్యదర్శి ఆచారి అన్నారు. ఆయన రాకతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ఈ ఎన్నికల్లో విజయానికి తోడ్పడుతుందని అన్నారు. జిల్లాలో డికె అరుణ, బండారు శ్రుతిల విజయం తప్పదన్నారు. తెరాస లోక్‌సభ పక్ష నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జితేందర్‌రెడ్డికి తెరాస అధిష్ఠానం ఈ మారు టికెటును నిరాకరించింది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు సహకరించలేదని స్వయానా కేసీఆర్ ఆయనకు టికెటును నిరాకరించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట భాజపా అగ్రనేత రాంమాధవ్‌తో చర్చలు జరపినట్లు వార్తలు వచ్చాయి. మూడు డిమాండ్లతో భాజపాలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. తెలంగాణ ఇంఛార్జి బాధ్యతలు, రాజ్యసభ సభ్యుడి పదవి ఇవ్వాలని ప్రధానంగా షరతులు పెట్టారు. చివరకు అందరి అంచనాలను నిజం చేస్తూ ఆయన భాజపాలో చేరారు. కాంగ్రెస్ నుంచి ఇప్పటికే భాజపాలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణ మహబూబ్‌నగర్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జితేందర్‌రెడ్డి చేరిక పార్టీకి మరింత బలాన్ని చేకూర్చనుంది. ఆయన వెంట అనుచరులు ఎవరెవరు వెళ్లనున్నారన్న దానిపై స్పష్టత రానుంది. ఈ నెల 29వ తేదీన మహబూబ్‌నగర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో జితేందర్‌రెడ్డి భాజపాలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనరాక నిజంగానే తమకు అసెట్ అని ఆచారి అన్నారు.