బిజెపిలోనూ తేలని నేతల ఎంపిక 

దసరా తరవాతే పేర్ల ప్రకటన
జాతీయ నేతల పరిశీలనకు వచ్చే అవకాశాలు
హైదరాబాద్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): ఎన్నికలకు షెడ్యూలు విడుదలైనా.. పోలింగ్‌కు సుమారు రెండు నెలల గడువు చిక్కడంతో కమలనాథులు నింపాదిగా అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తున్నారు.  జిల్లాల్లో ఎక్కడా ఇప్పటి వరకు ఒక్క సీటును కూడా ఖరారు చేయలేదు. అయితే ప్రచారం మాత్రం సాగిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని నాయకుల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని నాయకత్వం మరి కొందరి పేర్లను పరిశీలిస్తోందని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తున్న  పార్టీ నాయకత్వం అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. దసరా తరవాతనే అభ్యర్థల ఖరారు ఉంటుందని సమాచారం.  ఆ పార్టీ నాయకులు కొందరు ఇప్పటికే తమకు పోటీచేసే అవకాశం ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.  అసలు మొత్తంగా ఎందరు నేతలు పోటీకి సుముఖంగా ఉన్నారు?  ఏయే నియోజకవర్గాల్లో పార్టీ పరి స్థితి ఎలా ఉంది? ఆశావహుల్లో ఎందరికి కార్యకర్తల మద్దతు ఉంది .. తదితర అంశాలను పరిశీలించేందుకు జాతీయ నాయకత్వం జిల్లాలో పర్యటించనుందని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.బీజేపీ నాయకత్వం జిల్లాల వారీగా సమావేశాలతో క్షేత్ర స్థాయిలోని కార్యకర్తల మనోభావాలను తెలుసుకునే పనిలో ఉందంటున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని, ఆశావహుల్లో ఎవరైతే నెగ్గుకు రాగలుగుతారన్న అంశాలను వీరు సవిూక్షిస్తారని చెబుతున్నారు. ఆ తర్వాతే ఆయా స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని సమాచారం. దీంతో ఆ పార్టీ ఆశావహులు అభ్యర్థిత్వాల ప్రకటన కోసం దసరా వెళ్లిపోయేదాకా ఎదురుచూడక తప్పని పరిస్థితి ఉంది. కాగా, కొన్ని నియోజకవర్గాల్లో కొందరు సీనియర్‌ నాయకులు పోటీకి సుముఖంగా లేరని, ఓడిపోతామనుకుంటున్న స్థానాల్లో పోటీ చేయడం ఎందుకన్న నిరాసక్తతలో ఉన్నారని అంటున్నారు. ఈ నెల 24వ తేదీన జరిగే సమావేశం తర్వాత బీజేపీ అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తుందని పేర్కొంటున్నారు.