బిజెపిలో పెరిగిన పోటీ
ఉమ్మడి జిల్లాలో అత్యధికుల ఆసక్తి
నల్లగొండ,అక్టోబర్15(జనంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో పోటీకి బిజెపిలో ఆశావహులు పెరుగుతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంనుంచి తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ సీనియర్ నాయకుడు రామోజు షణ్ముఖా చారి ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారని అంటున్నారు. అయితే, పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డిని పోటీకి పెట్టాలని కొందరు ముఖ్య నాయకులు రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని కోరారని తెలిసింది. దీంతో నల్లగొండలో నూకల నర్సింహారెడ్డి, రామోజు షణ్ముఖ, మాజీ అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. ఎస్సీ రిజర్వుడు స్థానం నకిరేకల్‌కు విపరీతమైన పోటీ ఉందని, ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. మునుగోడులో
గత ఎన్ని కల్లో పోటీ చేసిన జి.మనోహర్‌రెడ్డి, దేవరకొండలో కళ్యాణ్‌నాయక్, నాగార్జున సాగర్‌లో కంకణాల శ్రీధర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు, మిర్యాలగూడలో పురుషోత్తంరెడ్డి, పాదూరి కరుణ, హుజూర్‌నగర్‌లో బొబ్బ భాగ్యారెడ్డి, కోదాడలో రాంనేని ప్రభాకర్, నూనె సులోచన, సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వర్ రావు, తుంగతుర్తిలో రామచంద్రయ్య, ఆలేరులో దొంతిరి శ్రీధర్‌రెడ్డి, భువనగిరిలో శ్యాంసుందర్‌రావు
తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఎస్సీ రిజర్వుడు స్థానమైన నకిరేకల్‌లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మిగిలిన నియోజకవర్గాల్లో కంటే ఎక్కువ మంది ఉన్నారని సమాచారం. ఇక్కడ బాకి పాపయ్య, లింగస్వామి, మరో ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు సైతం టికెట్ ఆశిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం.