బిజెపి మాటలకు..చేతలకు చాలా తేడా
రాష్ట్రం అతలాకుతలం అయినా పట్టింపులేని నేతలు
విమర్శలు వస్తున్నా పట్టించుకోని నాయకగణం
హైదరాబాద్,సెప్టెంబర్5 (జనం సాక్షి) : డబుల్ ఇంజన్ సర్కార్ కావాలి..తెలంగాణలో తదుపరి తమదే ప్రభుత్వం అంటున్న బిజెపి.. ప్రజలకు సేవలు అందించడంలో…వారి కష్టాల్లో పాలు పంచుకోవడంలో మాత్రం శ్రద్ద చూపడం లేదు. కేవలం పడికట్టు పదాలు, గంభీర ఉపన్యాసాలతో కాలం గడిపేస్తున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ అతలాకుతలం అయ్యింది. అయినా పెద్దగా స్పందించలేదు. ఇంతకన్నా దారుణం, ఘోరం మరోటి ఉండదు. ఒక్కరు కాదు…ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారు. మరో ఆరుగురు ఎంపిలు ఉన్నారు. ప్రజలు వారిని నమ్మి గెలిపించారు. ఇలాంటి విపత్కర సమయంలో మేమున్నామని ముందుకు రాకపోవడం, అదంతా కాంగ్రెస్ తప్పిదమన్న రీతిలో మాట్లాడుతున్నారు. కేంద్రం నిధులు ఉన్నాయి…ఖర్చు పెట్టుకోండని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓ ఉచిత సలహా పడేశారు. ఇకపోతే తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు అసలైన విషయాలపై స్పందించడం లేదు. ముఖ్య నేతలంతా ఎవరికి
వారే అన్నట్లుగా ఉంటున్నారు. ఈ పరిమామం వల్ల అసలు బీజేపీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. తాజాగా వరదల విషయంలో కేందాన్ని కాంగ్రెస్ పార్టీ పదేపదే సాయం కోరుతోంది. ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసింది. అవసరమైన హెలికాప్టర్లు, పవర్ బోట్లు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని పంపించలేదని ప్రజల్ని గాలికి వదిలేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీటిని తెలంగాణ బీజేపీ నేతలు కూడా తిప్పికొట్టలేకపోతున్నారు. మామూలుగా అయితే సాయం చేసి విమర్శలపై ఎదురుదాడి చేయవచ్చు . కానీ ఎవరికి వార తమకెందుకులే అనుకుంటున్నారు. అందు వల్లే ఎవరూ ముందుకు రావడం లేదు. ఖమ్మంకు ఆ స్థాయిలో వరద వస్తుందని ప్రభుత్వం ఊహించలేకపోయింది. బుడమేరు విజయవాడను ముంచింది కాబట్టి… ఆ నీరు ఖమ్మం వైపు వస్తుందని అంచనా వేయలేకపోయారు. చివరికి మున్నేరు పెద్ద ముప్పు తెచ్చి పెట్టింది. ఆరేడు అడుగుల ఎత్తున నీరు పారడం అంటే చిన్న విషయం కాదు. మామూలుగా అయితే గోదావరికి వరదలు వస్తే.. ఖమ్మం జిల్లా ఉలిక్కి పడుతుంది. ఈ సారి మాత్రం అందుకు భిన్నంగ మున్నేరు ముంచేసింది. హెలికాప్టర్లు లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం విమర్శలు ఎదుర్కో వాల్సి వచ్చింది. తర్వాత రోజే రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మంత్రులు అక్కడే ఉండి సహాయ పునరావసా చర్యలు చేపట్టారు. అయినప్పటికీ.. ప్రభుత్వం పెద్దగా ఏమ చేయలేదన్న విమర్శలను మూటగట్టుకుంది. అదే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిరది. విపత్తు వచ్చినా కేంద్రం కనీసం హెలికాప్టర్ల పంపలేదని.. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని పంపలేదని రుజువు అయ్యింది. పక్కన ఉన్న ఆంధ్రాకు 120 పవర్ బోట్లు, హెలికాప్టర్లు, ఎయిర్ ఫోర్స్ కూడా సాయానికి వెళ్లింది. కానీ తెలంగాణకు ఎంతమాత్రం సాయం అందలేదు. అది కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమేనని బీఆర్‌ఎస్ విమర్శించింది. ఇంత జరుగుతున్నా తమపై వస్తున్న విమర్శలకు బీజేపీ కౌంటర్ చేయలేకపోతోంది. దీనికి కారణం సమాధానం లేకపోవడం కాదు. నేతలు పెద్దగా పట్టించుకోకపోవడమే. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక్క లీడర్ కూడా బాధ్యత తీసుకోవడం లేదు. మరీ ముఖ్యంగా వరద పరిస్థితుల్లో బిజెపి పూర్తిగా విఫలం అయ్యింది. కేవలం విమర్శలకే పరిమితం అయ్యింది. బిజెపిలోఎవరికి వారు సౌంత ఎజెండా ప్రకారం స్పందించడం అలవాటు చేసుకున్నారు. అందుకే వారు కేంద్రాన్ని కూడా గట్టిగా నిలదీయడం లేదు.