” బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్టు దుర్మార్గం – బిజెపి నేత గజ్జల యోగానంద్”
శేరిలింగంపల్లి, ఆగస్టు 24( జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడమే కాకుండా పోలీసులు జలుంతో అక్రమ అరెస్టుకు పాల్పడడం దుర్మార్గమని బిజెపి శేరీలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్ స్పష్టంచేశారు. ఈమెరకు శేరిలింగంపల్లి బిజెపి నేతృత్వంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు శెట్టి కురుమ అధ్యక్షతన బుధవారం ఆదర్శనగర్ లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించిన నిరసన కార్యక్రమానికి యోగానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజుశెట్టితో కలిసి మాట్లాడుతూ కెసిఆర్ కుటుంబం కబ్జాలకు, లూటీలకు, దోపిడీలకు, కుంభకోణాలకు పెట్టింది పేరని ఆయన అన్నారు. భారతదేశాన్ని నివ్వరపోయేలా చేసిన ఢిల్లీ లిక్కర్ స్కాం లో కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత హస్తముందని తెలియడంతో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా తన పాదయాత్ర శిబిరంలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ దీనికి వ్యతిరేకంగా శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజుశెట్టి కురుమ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా డివిజన్ పరిధి ఆదర్శ్ నగర్ లో నల్లబ్యాడ్జిలతో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు.
కెసిఆర్ కుటుంబం కబ్జాలకు, లుటీలకు, దోపిడీలకు, స్కాంలకు పెట్టింది పేరని, తప్పు చేసిన కవిత ని వదిలేసి శాంతియుతంగా దీక్షచేస్తున్న బండిసంజయ్ ని, నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం పోలీసుల దుందుడుకుతనానికి నిదర్శనమని గజ్జల విమర్శించారు. అక్రమాలను అడిగిన సామరంగారెడ్డిపై టీ.అర్.ఎస్ గుండాలు దాడిచేసి కొట్టడం కెసిఆర్ రజాకార్ బుద్ధికి, అసహనానికి నిదర్శనమని, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. కెసిఆర్ కుటుంబం చేస్తున్న అవినీతి బాగోతాలు, వారి పరిపాలన లోపాలను బండి సంజయ్ తన పాదయాత్రద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారని, తద్వారా గులాబీ దండు మోసాలు, కుట్రలు బట్టబయలౌతుండడంతో భయంతో బండి పాదయాత్రని ఎలాగైనా ఆపాలని అరెస్ట్ లు, దాడులు చేస్తున్నారని యోగానంద్ దుయ్యబట్టారు. నక్సలైట్స్, టెర్రరిస్టులతోనే పోరాడిన బీజేపీకి ఈదాడులు తమకు కొత్తకావని, గులాబీమూక చేసే తాటాకు చప్పుళ్లకు బీజేపీ కార్యకర్తలు భయపడరని, ఇలాగే దాడులకు పాల్పడితే ప్రతి దాడులు తప్పవని గజ్జల హెచ్చరించారు. నిందితులను పక్కనపెట్టి బాధితులపైన కేసులుపెట్టడం సరికాదని, బీజేపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమకేసులను వెంటనే ఎటువంటి షరతులులేకుండా ఎత్తివేయాలని, లేదంటే రాబోయే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనడానికి సిద్దంగా ఉండాలని గజ్జల హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కాంచన కృష్ణ, ఎం అనిల్ గౌడ్, బొబ్బ నవతారెడ్డి, ఆంజనేయులు, జీ. రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెలగ శ్రీనివాస్, కే. జితేందర్, హరి కృష్ణ, శాంతి భూషణ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, రాకేష్ దూబే, బీమని విజయ లక్ష్మి, సత్య కుర్మా, పి శ్రీనివాస్, లలిత, బాలరాజు, సైఫుల్ల ఖాన్, శివ కుమార్ వర్మ, బీ సత్య నారాయణ, చంద్ర మోహన్, శివ గౌడ్, సి. సత్య నారాయణ, కిషన్ సుతర్, బొట్టు కిరణ్ మరియు అసెంబ్లీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.