బిహారీ ఏనుగులు పోతుంటే బహరీ కుక్కలు మొరుగుతుంటాయి
– నితీష్, లాలూలను కలిసి అభినందించిన శత్రుఘ్నసిన్హా
న్యూఢిల్లీ, నవంబర్ 11,(జనంసాక్షి): బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత మాటల యుద్ధం కొనసాగుతోంది. పార్టీకి చెందిన ఎంపీ, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాను సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్ వర్గియా కుక్కతో పోలిస్తే.. దానికి షాట్‌గన్ తీవ్రంగా స్పందించారు. విజయ్ వర్గియా చేసిన వ్యాఖ్యలపై తన స్పందన ఏంటని చాలామంది అడుగుతున్నారని, ”ఏనుగు బిహార్ వెళ్తుంటే.. వేలాది కుక్కలు మొరుగుతాయి” అన్నదే తన సమాధానమని ఆయన ట్వీట్ చేశారు. ”కారు వెనుక కుక్క పరిగెడుతూ, తనవల్లే కారు ముందుకు వెళ్తోందని అనుకుంటుంది. శత్రుఘ్న సిన్హాకు బీజేపీ వల్ల గుర్తింపు వచ్చింది తప్ప బీజేపీకి శత్రుఘ్న సిన్హా వల్ల కాదు” అని విజయ్ వర్గియా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. శత్రుఘ్న సిన్హా పార్టీ క్రమశిక్షణను దృష్టిలో పెట్టుకోవాలని, అంతేతప్ప ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం సరికాదని ఆయన చెప్పారు. అయితే, పార్టీ నేతలు ఇలాంటి భాష ఉపయోగించడం మానుకోవాలని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. విజయ్ వర్గియా వ్యాఖ్యలను ఖండించారు.పట్నాలో ఆయన ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను కలసి, అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీ ఘోరంగా ఓడిపోవడానికి కారకులైన నాయకులు గుణపాఠం నేర్చుకోవాలని అన్నారు. ఓటమికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆర్జేడీనేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను కూడా శత్రుఘ్నసిన్హా కలిసి కింగ్‌మేకర్‌గా అవతరించారంటూ అభినందించారు.
సీఎం అభ్యర్థిగా నేనుంటే..
బీజేపీ తరఫున బిహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రకటించి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు మరోలా ఉండేవని సోమవారం బాలీవుడ్ నటుడు, ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్నసిన్హా వ్యాఖ్యానించారు. బిహార్ ముద్దుబిడ్డనైన తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే తన అభిమానులు, మద్దతుదారులపై అది చాలా ప్రభావం చూపించి ఉండేదని అన్నారు. ఇండియా టీవీ చానల్‌లో ప్రసారమయ్యే ఆప్‌కీ అదాలత్ అనే కార్యక్రమంలో శత్రు ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్టు చానల్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, సిన్హాను లాలూ ప్రశంసించారు. ఇదిలా ఉంటే శత్రు వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్‌నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా తీవ్రంగా స్పందించారు. శత్రును ఆయన కుక్కతో పోల్చారు.