బీఎస్పీతో దోస్తీ కొనసాగుతుంది

– బిజెపి ఓటమే మా లక్ష్యం

– అందుకు కొన్ని సీట్లు త్యాగానికి వెనకాడం

– అఖిలేశ్‌

లక్నో,జూన్‌ 11(జనంసాక్షి):వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీతో తమ పొత్తు కొనసాగుతుందని.. భాజపాను ఓడించేందుకు అవసరమైతే కొన్ని సీట్లను వదులుకునేందుకు కూడా తాము సిద్ధమని ప్రకటించారు. బీఎస్సీతో కలిసి పనిచేయడం కొనసాగుతుంది. వారితో కూటిమికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇందుకోసం కొన్ని సీట్లను తాగ్యం చేసేందుకూ సిద్ధం. భాజపాను గద్దే దించడమే మా లక్ష్యం’ అని అఖిలేశ్‌ అన్నారు. ఇటీవల యూపీలో జరిగిన కైరానా ఉప ఎన్నికలో విపక్షాలన్ని కలిసి మహా కూటమి పేరుతో పోటీ చేసి భాజపాపై విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ కూటమి ఎన్నిరోజులు కొనసాగుతుందోనని పలువురు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అఖిలేశ్‌ ఈ విధంగా స్పందించారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో నరేంద్ర మోదీపై ఈ కూటమి తరఫున బలమైన వ్యక్తిని పోటీకి దింపాలని అఖిలేశ్‌ ఇటీవల ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు చాలా రోజుల సమయం ఉందని.. దీనిపై ఇప్పుడే స్పందించడం సరికాదని.. అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌ పేర్కొంది. మరోవైపు భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా విపక్షాల కూటమి ప్రతిపాదనను తేలికగా తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో భాజపా భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.