బీఎస్పీ ఎమ్మెల్యే కుమారుడిపై రేప్ కేసు
ముజఫర్‌నగర్ : బీఎస్పీ ఎమ్మెల్యే కుమారుడు సహా ముగ్గురు వ్యక్తులు 17 సంవత్సరాల బాలికను అపహరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బీఎస్పీ ఎమ్మెల్యే మౌలానా జమీల్ అహ్మద్ కుమారుడు నయీమ్, ఎమ్మెల్యే బావమరిది, మూడవ అగంతకునిపై ఇక్కడి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన వివరాల ప్రకారం బసయిరా గ్రామంలో ఇటీవల ఒక బాలికను అపహరించుకుపోయి సమీపంలో ఉన్న అడవిలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటపెడితే హత్య చేస్తామని బెదిరించారు. దీంతో వారిపై ఐపీసీ 376,363,506 సెక్షన్ల కింద నేరాభియోగాలు నమోదు చేశారు. తన కుమారుడు, బావమరిదిపై వచ్చిన అభియోగాలను ఎమ్మెల్యే తోసిపుచ్చారు. తనపై రాజకీయ కుట్రతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు.