బీజేపీలో చేరుతాననేది అవాస్తవం
– తన పర్యటన పూర్తితర్వాత స్పష్టత ఇస్తా
– సమాజానికి తనవంతు సేవచేయాలనే ప్రజల్లోకి వచ్చా
– రైతులు సబ్సిడీలు, పథకాలు ఆశించడం లేదు
– పంటలకు గిట్టుబాటు ధర ఇస్తే చాలంటున్నారు
– మాజీ జేడీ లక్ష్మీనారాయణ
నెల్లూరు, మే31(జనం సాక్షి) : ఏదో ఓ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలో వాస్తవం లేదని, జిల్లాల పర్యటన పూర్తి చేసిన తరువాతే… రాజకీయ నిర్ణయం తీసుకుంటానని మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ వెల్లడించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. సమాజానికి తన వంతుగా సేవ చేయాలనే ప్రజల్లోకి వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. చుక్కల భూముల సమస్య పరిష్కారం అయినట్టే… రాష్ట్రంలో ప్రతి సమస్య పరిష్కారం కావాలని లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. రైతలు సబ్సిడీలు, పథకాలు ఆశించడం లేదని, పంటలకి గిట్టుబాటు ధర ఇస్తే చాలంటున్నారని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మీనారాయణనే అనే చర్చ జరుగుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం విూడియాతో సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణా.. కన్నా లక్ష్మీనారాయణా అంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు
కన్నా సమాధానమిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎవర్ని నిర్ణయిస్తారో వాళ్లే ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పారు. ఈ మధ్య ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పాల్గొనడం కూడా ఈ చర్చకు మరింత బలాన్ని ఇస్తోంది. ఆయన సంఘ్ వ్యక్తి అని.. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీలో చేరతారని విశ్లేషణలు మొదలయ్యాయి. ఆయన మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వీఆర్‌ఎస్ తీసుకున్న తర్వాత ఏపీలో జిల్లాల పర్యటనలో ఉన్నారు. రైతుల సమస్యలను తెలుసుకుంటున్నారు. పార్టీ గురించి, పోటీ గురించి ఆయన స్వయంగా చెప్పకపోయినా వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేయాలని ఉందన్న విషయాన్ని ఆయన గతంలో చెప్పారు.