బీజేపీ కీలక రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

-గుజరాత్‌లో రెండు దశల్లో పోలింగ్‌
-తొలి విడత డిసెంబర్‌ 13, మలివిడత 17
-హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒకే దశలో 4న పోలింగ్‌
-రెండు చోట్ల ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 20న..
న్యూఢిల్లీ, అక్టోబర్‌ 3 (జనంసాక్షి):
గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ఖరారైనట్టు చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ విఎస్‌ సంపత్‌ తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూలులోని వివరాలను తెలిపారు. ఇవిఎంలతో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. పై రెండు రాష్ట్రాల్లో ఓటర్ల చేరికకు మరోమారు అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు. భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ బుధవారం నుంచే అమలులోకి వచ్చినట్టయిందన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చుపై గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాంకులో ఖాతా తెరవాలని కోరారు. గుజరాత్‌ 182 నియోజకవర్గాల్లో..గుజరాత్‌లోని 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు దఫాలుగా పోలింగ్‌ జరగనున్నట్టు సంపత్‌ చెప్పారు. తొలివిడత పోలింగ్‌ డిసెంబరు 13న, మలి విడత డిసెంబరు 17న పోలింగ్‌ జరగనున్నదన్నారు.అలాగే తొలివిడత పోలింగ్‌కు నవంబరు 17న నోటిఫికేషన్‌ వెలువడనున్నది. రెండో విడత పోలింగ్‌కు నవంబరు 23న నోటిఫికేషన్‌ వెలువడుతుందని చెప్పారు. ఓట్ల లెక్కింపు డిసెంబరు 20న జరుగుతుందని, అదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువరించనున్నట్టు వివరించారు. గుజరాత్‌లో 182 నియోజకవర్గాల్లో.. 13 నియోజకవర్గాలు ఎస్సీలకు, 26 నియోజకవర్గాలు ఎస్టీలకు కేటాయించిన విషయం తెలిసిందేనని చెప్పారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని 68 నియోజకవర్గాల్లో..
హిమాచల్‌ప్రదేశ్‌లోని 68 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను ఎన్నికలు జరగనున్నట్టు కేంద్ర చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ సంపత్‌ చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఒకే దశలో నవంబర్‌ 4న పోలింగ్‌ జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబరు 20న జరుగుతుందన్నారు. అదేరోజు ఫలితాలు వెల్లడవుతాయన్నారు. మొత్తం 68 నియోజకవర్గాలు కాగా.. వాటిల్లో 17 అసెంబ్లీ స్థానాలు ఎస్‌సిలకు, మూడు స్థానాలు ఎస్టీలకు రిజర్వు అయినట్టు చెప్పారు.