బీజేపీ నేతలకు కర్రుకాల్చి వాత పెట్టాలి

– చెక్కులు తీసుకొని బీర్‌లు తాగుతున్నారని ఎద్దేవా చేస్తారా
– దమ్ముంటే ప్రదానితో మాట్లాడి మరో రూ. 8వేలు ఇప్పించండి
– రైతుబంధు గాలిలో కాంగ్రెస్‌ కొట్టుకుపోతుంది
– తెరాస అధికారంలో ఉన్నంతవరకు పెట్టుబడి సాయం అందిస్తాం
– రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు
– మనూర్‌లో రైతుబంధు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి
సంగారెడ్డి, మే14(జ‌నం సాక్షి) : రైతుబంధు పథకంపై, రైతులపై అడ్డగోలుగా మాట్లాడే నేతలకు కర్రుకాల్చి వాత పెట్టాలని, రైతులకు మేలు చేసే పథకాలపై విమర్శలు చేయటం రైతులపై వారికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మనుర్‌లో రైతు బంధు కార్యక్రమంలో మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఎడ్లబండిపై ఊరేగింపుగా వచ్చిన హరీష్‌రావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించిన ఆయన.. నాడు కాంగ్రెస్‌ నేతలు వ్యవసాయం దండగ అన్నారు.. నేడు టీఆర్‌ఎస్‌ వ్యవసాయం పండగ అంటోందన్నారు. నాడు ప్రజలు వలసలు వెళితే.. టీఆర్‌ఎస్‌ పాలనలో నేడు గ్రామాలకు తిరిగి వస్తున్నారని చెప్పారు. బీజేపీ నాయకులు రైతుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, బీజేపీ నాయకులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. లేదంటే.. కర్రు కాల్చి వాత పెడతామంటూ హెచ్చరించారు. నిజంగా బీజేపీకి రైతులపై ప్రేమ ఉంటే బీజేపీ నేతలు ప్రదాని వద్దకు వెళ్లి రైతులకు తెరాస ప్రభుత్వం ఎకరాకు రూ. 8వేలు ఇస్తుంది, మనం కూడా మరో రూ. 8వేలు ఇచ్చి దానిని రూ.16వేలు చేయించాలని హరీష్‌రావు సూచించారు. అప్పుడే వారికి రైతులపై ప్రేమ ఉందని తాము ఒప్పుకుంటామని, రైతులసైతం బీజేపీ నేతలకు బ్రహ్మరథం పడతారని అన్నారు. అలా కాకుండా మేము ఇస్తున్న రైతుబంధు చెక్కులతో రైతులు బీర్‌లు, మందు తాగుతున్నారని యద్దేవా చేయడం సిగ్గుచేటన్నారు. తెరాస అధికారంలో ఉన్నంత వరకు పెట్టుబడి సాయం అందిస్తామని హరీష్‌రావు స్పష్టం చేశారు. రైతుబంధు కార్యక్రమంతో కాంగ్రెస్‌ బస్సుయాత్ర వెలవెలబోతుందని అన్నారు. కాంగ్రెస్‌లో సీఎంలు ఎక్కువైపోయారని, జానారెడ్డి నేను సీఎం అంటే, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నేను సీఎం అంటున్నారని అన్నారు. వీరా ప్రజా సమస్యలను పరిష్కరించేదని హరీష్‌రావు నిలదీశారు. ముందు సీఎం అభ్యర్థులమని పోటీపడేవారు అసలు ఎమ్మెల్యేలుగా గెలుస్తారో లేదో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. తొలుత మనూర్‌ బ్యాంక్‌లో డబ్బుల పంపిణీపై హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సక్రమంగా నగదు అందజేయాలని, ఇబ్బందులు రానివ్వద్దని బ్యాంక్‌ సిబ్బందికి
హరీష్‌రావు సూచించారు.