బీమారంగ ఉద్యోగుల సమ్మె

న్యూఢిల్లీ,మార్చి9 : బీమా బిల్లుకు వ్యతిరేకంగా సమ్మె సైరన్‌ మోగించేందుకు బీమా ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఇన్సూరెన్స్‌ రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితి పెంపును నిరసిస్తూ సోమవారం  దేశవ్యాప్తంగా ఒక రోజు సమ్మె చేపట్టారు. ఈ సమ్మెలో నాలుగు ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థ ఉద్యోగులతో పాటు ఎల్‌ఐసీ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. బీమా రంగంలో ఎఫ్‌డీఐని ప్రస్తుతమున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచే బీమా బిల్లును ఇటీవలే లోక్‌సభ ఆమోదం పొందింది. జీవిత బీమా, సాధారణ బీమాకు చెందిన 4 ప్రభుత్వ రంగ కంపెనీలను విలీనం చేయాలని కోరుతుంటే మోడీ సర్కార్‌ వాటిని బహుళజాతి కంపెనీల పరం చేసేందుకు బిల్లు తెచ్చిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ మోడీ సర్కార్‌పై విరుచుకుపడింది. విదేశీ, మల్టీనేషనల్‌ కంపెనీలతో మిలాఖత్‌ అయి భారతీయ బీమా రంగాన్ని బలిపీఠంపైకి నెడుతోందని ధ్వజమెత్తింది. బీమారంగంలో ఎఫ్‌డీఐల పరిమితి పెంచడమంటే… బీమా రంగ ప్రైవేటీకరణకు దారులు తెరవడమేనని విమర్శించింది. ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా రాజకీయాలకతీతంగా అన్ని సంఘాలు ఏకతాటిపై నిలిచి పోరాడాలని ఏఐఐఇఏ పిలుపునిచ్చింది. ఈ సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎన్డీఏ ప్రభుత్వ చర్య వినాశకరమైనదని సీఐటీయూ నేతలు మండిపడ్డారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు బషీర్‌బాగ్‌లోని యునైటెడ్‌ ఇండియా రీజినల్‌ ఆఫీస్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. సమ్మెకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు తెలిపింది. ప్రభుత్వ రంగంలోని 4 సాధారణ బీమా సంస్థలు పోటీపడి భారీ డిస్కౌంట్లు ఇచ్చి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాయని వీటిని విలీనం చేయాలని యూనియన్‌ లీడర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా చేస్తే ఏడాదికి వెయ్యి కోట్లు ఆదా అవుతాయని చెప్పుకొస్తున్నారు.