బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం ముఖ్యమంత్రి కిరణ్‌

విజయవాడ, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి)
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పా రు. కృష్ణా జిల్లాలో ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్న ఆయన బుధవారం గుడి వాడ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. జయంతి గ్రామంలో గొర్రెల
కాపరులతో ఆయన ముఖాముఖిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను సీఎంకు తెలిపారు. సీఎం స్పందిస్తు గొర్రెల కాపరుల సంక్షేమానికి వంద కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా వ్యాధుల కారణంగా కానీ, ప్రకృతివైపరీత్యాల కారణంగా గొర్రెలు మరణిస్తే ఒక్కొ గొర్రెకు వెయ్యి రూపాయల పరిహారం ప్రభుత్వం అందిస్తుందని సీఎం చెప్పారు. జిల్లాలో గొర్రెల పెంపకంపైనే ఆధారపడి అనేక వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, వారికి ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని సీఎం చెప్పారు. అనంతరం ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో బీడు భూములన్నింటినీ సాగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మండలంలో ఎక్కువ భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చేందుకు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. బీసీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీలను ఆర్ధికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే బీసీ సంక్షేమ బడ్జెట్‌ను 2,100 కోట్ల నుండి 3,100 కోట్లకు పెంచామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా బీసీ ఫెడరేషన్లకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని, ఫెడరేషన్లకు కూడా నిధులు భారీగా పెంచినట్లు సీఎం చెప్పారు. విద్యార్ధుల కోసం 28వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన చెప్పారు. దేశంలో మరే రాష్ట్రప్రభుత్వం విద్యార్ధులకు ఫీజుల కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం లేదని సీఎం తెలిపారు.
సీఎం పర్యటనలో స్వల్ప మార్పు
రెండోరోజు సీఎం ఇందిరమ్మ బాటలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గుడివాడ నుంచి ఆయన వీరులపాడు, జయంతికి వెళ్ళాల్సి ఉంది. జయంతిలో హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు స్థలం అనుకూలంగా లేకపోవడంతో ఆయన షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గుడివాడ నుంచి ఆయన నందివాడ చేరుకొని ఆ మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు. తమిరిసలో చేపల చెరువులు సందర్శించిన ఆయన చేపల చెరువుల యజమానులతో మాట్లాడారు.