బీసీల హక్కులు కాపాడాలి
ఆదిలాబాద్, జూలై 31 : జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న బిసిల హక్కులను కాపాడాలని బిసి నాయకులు రాందాస్, భగవత్ పటేల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో తరతరాలుగా ఆదివాసుల గిరిజనులతో కలిసి పోడు వ్యవసాయం చేసుకుంటున్న బిసిలకు ప్రత్యేక హక్కులను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 1950కి పూర్వం గిరిజన ప్రాంతాల్లో జీవిస్తు పోడు వ్యవసాయాన్ని నమ్ముకున్న బిసిల భూములకు పట్టాలు ఇచ్చి, బ్యాంకుల్లో పంట రుణాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సన్నకారు రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు ఏజెన్సి బిసిలకు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న బిసిలకు గిరిజనులతో సమానంగా ప్రాధాన్యత కల్పించాలని వారు డిమాండ్ చేశారు లేనిచో బిసిలను గిరిజన ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించి ఐదు ఎకరాల సాగుభూమిని ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే హక్కుల సాధన కోసం గిరిజన ప్రాంతాల్లోని బిసిలంతా ఐక్యమై ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.