బీసీ ఓటర్ల గణనను చేపట్టిన జీహెచ్‌ఎమ్‌సీ

హైదరాబాద్ : బిసీ ఓటర్ల గణనపై జీహెచ్ఎంసీ వేగం పెంచింది. గడువు దగ్గర పడుతుండటంతో అధికారులు పరుగులు పెడుతున్నారు. సెలవు దినాల్లో కూడా పనిచేయాలని బిఎల్ ఓ లకు ఆదేశాలు వెళ్లాయి.ఓట్ల తొలగింపుపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసే పనిలో జీహెచ్‌ఎంసీ పడింది. బూత్‌ లెవల్‌ అధికారులు ఇప్పటికే వివరాలు సేకరిస్తున్నారు. అదే సమయంలో బీసీ ఓటర్ల గణనను కూడా జీహెచ్‌ఎంసీ చేపట్టింది. ఈ నెల 3వ తేదీ నుంచి బీఎల్‌వోలు గణన ప్రారంభించారు. ఇప్పటివరకు కేవలం 35 శాతం ఓటర్ల వివరాలను మాత్రమే సేకరించగలిగారు. దీంతో ప్రక్రియను వేగవంతం చేసేందుకు గ్రేటర్‌ కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. అనుమానాల నివృత్తి, బీసీ ఓటర్ల గణన గడువు లోపు ముగించడానికి చర్యలు చేపట్టారు. రెండొ శనివారం, ఆదివారం కూడా విధులను నిర్వహించాలని బూత్‌ లెవెల్‌ అధికారులను ఆదేశించారు.బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి బీసీ ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. బిసి అయితే వారి నుంచి సంతకం తీసుకోవడంతో పాటు కాంటాక్ట్ నంబర్‌ కూడా తీసుకుంటున్నారు.ఓటర్‌ జాబితాపై గందరగోళం నెలకొనడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తొలగించిన ఓట్లను పునః పరిశీలన చేస్తున్నారు. ఇళ్లు మారిన వారిని, ఇంటికి తాళం వేసిన వారిని ఫోనులో సంప్రదించి వివరాలు తీసుకుంటున్నారు.బిసి ఓటర్లపై లెక్కింపుపై జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో కమిషనర్‌ జనార్థన్‌రెడ్డి చర్చించారు.చాలాకాలం పెండింగ్‌లో ఉన్న బూత్‌లెవిల్‌ అధికారుల పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలని సూచించారు. వార్డుల విభజనపై అందిన అభ్యంతరాలను వెంటనే పరిష్కరించాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు.