బీసీ ఫెడరేషన్ లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయాలి

ధనుంజయ నాయుడు విజ్ఞప్తి
గరిడేపల్లి, అక్టోబర్ 15 (జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 బీసీ ఫెడరేషన్ లకు పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు.
 శనివారం ఆయన గరిడేపల్లి మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ అనుకూల చర్యలు చేపట్టాలని జనాభాలో బీసీలు 56% గా ఉన్నారని అందువల్ల బీసీల మద్దతు కొరకు తెరాస ప్రభుత్వం సానుకూల వైఖరిని అవలంబించాలని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు గడిచిపోయాయని బీసీ యువతకు సబ్సిడీ రుణాలు అందించలేక పోయిందని ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆ విధంగానే బీసీ యువతకు కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ఆయన కోరారు.
 రాష్ట్రంలో బీసీ ఫెడరేషన్ లు  నామ్ కే వాస్తుగా మారాయని ప్రతి బడ్జెట్లో నిధులు పెడుతున్నారు కానీ నిధులు విడుదల చేయడం లేదని బీసీ ఫెడరేషన్ లకు పాలకమండళ్లు ఏర్పాటు చేయాలని గత మూడున్నర ఏండ్లుగా ఫెడరేషన్ తరఫున ఎలాంటి ప్రపోజల్స్ పెట్టిన వాటన్నింటినీ ప్రభుత్వం పక్కన పడవేయడం ఏమిటని అలాగే అత్యంత వెనుకబడిన కులాల ఎం బి సి కు సంవత్సరానికి 1000 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి 2015లో ప్రకటించారని అయితే ఈ ఏడు సంవత్సరాల కాలంలో 7000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం 200 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి చేతులు దులుపుకున్నారని కనీసం ఎంబీసీకి ఆఫీస్ కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న ఐదు లక్షల 70  వేల మంది బీసీ యువతకు రుణాలు మంజూరు చేయాలని మళ్లీ కొత్తగా ఇంటర్వ్యూలు నిర్వహించి కొత్త వారిని ఎంపిక చేసి వారికి కూడా రుణాలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఆయన వెంట బీసీ హక్కుల సాధన సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు దంతాల రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు బాదే నరసయ్య  ఉన్నారు.