బీసీ సమాజానికి కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలి : మంత్రి గంగుల

హైదరాబాద్‌  (జనం సాక్షి )

ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోమని, వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సమానత్వాన్నితీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్  కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ బీసీ నాయకుల సమావేశంలో మంత్రి గంగుల పాల్గొని మాట్లాడారు.

సమాజంలో 56% ఉన్న బీసీ జనాభాను, వెనుకబడిన వర్గాల నేతలను టార్గెట్‌ చేసుకొని కాంగ్రెస్ నేతలు తిట్టడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ అధినాయకత్వం విధానం కూడా వెనుకబడిన వర్గాలను దూషించడమేనా? స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ లోని బీసీ నేతలు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వెనుకబడిన వర్గాల మొత్తం సమాజానికి కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మాపై అన్యాయం జరిగితే కులాలుగా కాదు.. బీసీ సమాజంగా ప్రశ్నిస్తాం, తిరగబడతాం. మీలాగా బీసీలను వెనుకబడిన వర్గాలను దూషిస్తూ మేము మాట్లాడలేం. మాకు కేసీఆర్ సంస్కారం నేర్పారన్నారు. మేం బానిసలం కాదు చైతన్యవంతులం అని స్పష్టం చేశారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన కులాలను, కులవృత్తులను ప్రభుత్వం వేలకోట్లతో అభివృద్ధి  చేస్తున్నదని పేర్కొన్నారు. వేల కోట్లతో ఆత్మగౌరవ భవనాలు, వేలాది గురుకులాలను నిర్మించిందని తెలిపారు. బడుగుల అభ్యున్నతికి పాటుపడుతున్న బీఆర్‌ఎస్‌, బీసీ నేతలను అకారణంగా దూషిస్తే తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు.

తాజావార్తలు