.బీహారీ కావాలా.. బాహర్ వాలా కావాలా..?
– నితీష్ కుమార్
బీహార్ అక్టోబర్ 25 (జనంసాక్షి):
ఎన్నికల్లో మోడీ మాటల గారడీలో పడొద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేర్కొన్నారు. పాట్నాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నితీష్.. ఈ రాష్ట్రానికి బీహారీ కావాలా… బాహర్ వాలీ కావాలా అంటూ.. స్థానికులను ప్రశ్నించారు. బయటి వాళ్ల అవసరం మనకు లేదని… ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసన్నారు. ప్రధాని మాటలకు..చేతలకు పొంతన లేదని కొన్ని అంశాలపై మాట్లాడాల్సి వచ్చినా కూడా మోడీ మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. బీహార్ కు ప్రత్యేక ప్యాకేజీ కల్పించడం వంటి ఎన్నో వాగ్ధానాలను మరిచిపోయారని నితీష్ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ధీటుగా సమాధానమిస్తున్నారు. మోడీ మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతలేదని చెపుతున్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోకపోవడమే కాక, వాటిని ప్రస్తావించిన సందర్భాలు కూడా లేవంటూ విమర్శించారు.
బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ కల్పించడం వంటి ఎన్నో వాగ్ధానాలను ప్రధాని మరచిపోయారన్నారు. దాద్రి, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి ఘటనలపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ నితీష్ కుమార్ ప్రశ్నించారు. జేడీయు – ఆర్జేడీ కూటమిలో ముగ్గురు స్వార్థపరులు ఉన్నారంటూ మోడీ చేసిన విమర్శలకు నితీష్ కుమార్ ధీటుగా సమాధానమిచ్చారు.
మరోవైపు.. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కే ఓటు వేయాలని మూడో విడత ఎన్నికలకు సిద్ధమవుతున్న బీహార్ ప్రజలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచన చేశారు. కోల్‌కతాలో ఆమె మాట్లాడుతూ, నితీష్ వంటి వ్యక్తి దేశానికి ఎంతో అవసరమన్నారు. ఆయన వల్లే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనను మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఆమె సూచించారు.