బీహార్‌లో రెండవ విడత పోలింగ్‌ ప్రశాంతం

1

– 55 శాతం ఓటింగ్‌

పాట్నా, అక్టోబర్‌ 16 (జనంసాక్షి):

బీహార్‌ రెండో విడతలో 55% పోలింగ్‌ నమోదైంది. రెండో విడతలో 6 జిల్లాల్లోని 32 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. వీటిలో 23 నియోజకవర్గాలు నక్సల్‌ ప్రభావిత నియోజకవర్గాలు కావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లక్షకు పైగా భద్రతా సిబ్బంది పహారా కాశారు. 32 మంది మహిళా అభ్యర్ధులతో సహా 456 మంది అభ్యర్ధుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

బీహార్‌ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు జరిగాయి. మొత్తం 32 నియోజకవర్గాల్లో 456 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు. ఈ దశ ఎన్నికల్లో ఆరు నక్సల్స్‌ జిల్లాలు కైమూర్‌, రోహతస్‌, ఆర్వాల్‌, జెహానాబాద్‌, ఔరంగాబాద్‌, గయా ఉండటంతో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 23 నియోజక వర్గాలు ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ జిల్లాలన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావటంతో పోలింగ్‌ సమయాలను గంట నుంచి రెండు గంటలు తగ్గించారు. మొత్తం 32 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్‌ మొదలవుతుంది. అయితే 11 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3గంటలకు, 12స్థానాల్లో సాయంత్రం 4గంటలకు పోలింగ్‌ ముగిసిపోతుంది. కేవలం 9 నియోజక వర్గాల్లో మాత్రమే సాయంత్రం 5గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. ఈ నియోజకవర్గాల్లో 993 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. నేడు ఎన్నికలు జరగనున్న ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానమైన ఇమామ్‌గంజ్‌ నుంచి మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ అవామ్‌ మోర్చా నేత జితన్‌ రామ్‌ మాంఝీ పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్‌, జేడీయూ నేత ఉదయ్‌నారాయణ్‌ చౌదురీ మాంఝీని ఈ నియోజకవర్గంలో ఎదుర్కొంటున్నారు. రెండో దశ ఎన్నికల్లో కుల ప్రభావమే అధికంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దుర్గామాతే నా ప్రాణాలు కాపాడింది

దుర్గామాతే తన ప్రాణాలు కాపాడిందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చెప్పారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. తన మెడలో ఉన్న దుర్గామాత లాకెట్‌ తీసి ప్రజలకు చూపుతూ దుర్గామాత దయవల్లే తనకు ప్రాణహాని కలగలేదన్నారు. మోతీహారీలోని బహిరంగసభ వేదికపై కూర్చున్న లాలూపై తొలుత సీలింగ్‌ ఫ్యాన్‌ పడింది. చాయ్‌ తాగుతుండగా ఆయన కుడి చేయిపై పడింది. ఆయన కుడి చేయికి గాయం కూడా అయింది. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్యాన్‌ సౌండ్‌ చేస్తూ ప్రమాదకరంగా ఉందని నిర్వాహకులకు లాలూ చెబుతుండగానే ఈ ఘటన జరిగింది. తలపై పడకపోవడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది.