బీహార్‌లో వలసలు నిరోధిస్తాం
– యువతకు ఉపాధి కల్పిస్తాం
– ఎన్నికల ప్రచారసభలో మోదీ
పాట్నా,అక్టోబర్30(జనంసాక్షి):
బీహర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోడీ ముమ్మరం చేశారు. ఇక్కడ ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో జరగనున్న నాలుగో దశ ఎన్నికల కోసం గోపాల్‌గంజ్‌లో ఆయన శుక్రవారం ప్రచారంలో పాల్గొన్నారు. బిహార్ యువత వలస వెళ్లకుండా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హావిూ ఇచ్చారు. బిహార్ అభివృద్ధే అన్ని సమస్యలకు పరిష్కారమని, తనపై నమ్మకం ఉంచండి.. అవినీతిని అంతం చేసి చూపిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతిపరుల ఆస్తులు జప్తు చేస్తాం… వారి ఇళ్లలో పాఠశాలలు తెరుస్తామని నితీష్ గతంలో చెప్పారు. అవినీతిపరులపై ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదని ప్రధాని ప్రశ్నించారు. ఓ మంత్రి డబ్బులు తీసుకుంటూ చిక్కితే నితీష్ ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. బిహార్‌కు సేవ చేసే అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బిహార్ యువత వలసబాట పట్టేందుకు కారణం ఎవరని ప్రశ్నించారు. బిహార్ కుంభకోణాల జాబితాను ప్రధాని సభలో చదివి వినిపించారు. మహాకూటమి నేతలు అత్యంత దిగజారుడు భాషను ఉపయోగిస్తూ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపు-ఓటములు సహజమని మోదీ వ్యాఖ్యానించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ తనపై ఆరోపణలు చేయలేక..సొంత రాష్ట్ర ప్రజలపైనే అసహనం వ్యక్తం చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. మహాకూటమి నేతలు అన్ని స్థాయిల్లోనూ రాష్ట్ర మర్యాదను మంటగలిపారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, మహాకూటమి నేతల అత్యంత దిగజారుడు బాషను వాడుతున్నారని మోదీ అన్నారు.
గతంలో కూటమి నేతలు నాపై ఆరోపణలు చేశారని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. నితీశ్ ప్రభుత్వం బిహార్ ప్రజలు చేసిందేమిటని ప్రజలను ప్రశ్నించారు. బిహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఐదు దశల్లో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు మూడు దశల ఎన్నికలు పూర్తి అయినాయి. నాలుగో దశ నవంబర్ 1వ తేదీన, ఐదో దశ.. తుది దశ నవంబర్ 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఆ వెంటనే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.