బూటకపు వాగ్దానాలను కార్మికులు నమ్మొద్దు – ఇఫ్టూ నాయకుడు కృష్ణ
గోదావరిఖని, మే 26, (జనం సాక్షి):
సింగరేణిలో రానున్న గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల దృష్ట్యా పలు కార్మిక సంఘాలు చేస్తున్న వాగ్దానాలను కార్మికులను నమ్మి, మోసపోవద్దని ఇఫ్టూ రాష్ట్ర కార్యదర్శి ఐ.కృష్ణ కార్మికులకు సూచించారు. శనివారం సీడీికే-2వ బొగ్గుగనిపై ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. అసెంబ్లీ, పార్లమెంట్ మేనిఫెస్టోలను మైమరిపించే విధంగా సింగరేణి కార్మిక సంఘాలు తమ హామీల వర్షాన్ని గుప్పిస్తున్నాయని, కార్మిక హక్కులను యాజమాన్యానికి తాకట్టుపెట్టిన కార్మిక సంఘాలే… ఓట్ల కోసం, అధికారం కోసం బూటకపు వాగ్దానాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. సింగరేణిలో హక్కుల సాధన కేవలం విప్లవ సంఘాలతోనే సాధ్యమైందని, నేడు విప్లవ సంఘంగా రాజీలేని పోరాటం చేస్తున్న ‘ఇఫ్టూ’ను రానున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపించి, హక్కుల సాధనకు కృషిచేయాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ గేట్‌మీటింగ్‌లో నాయకులు ఇ.నరేష్, ఐ.రాజయ్య, ఇ.రామకృష్ణ, ములుగు భీమయ్య, తోకల రమేష్, ఎండి.వలీ అహ్మద్, టి.రాజయ్య, టి.అయిలయ్యతో పాటు కార్మికులు పాల్గొన్నారు.