బెంగాల్‌ హత్యాచారం ఘటన.. కేసు సవాల్‌గా మారింది

` ఆధారాలు చెరిపివేయడం వల్ల దర్యాప్తుపై ప్రభావం: సీబీఐ
` వైద్యురాలి తల్లిదండ్రులకు లంచం ఆరోపణలు
` తోసిపుచ్చిన సిఎం మమతా బెనర్జీ
కోల్‌కతా(జనంసాక్షి): పశ్చిమ బెంగాల్‌లో వెలుగు చూసిన ఘోర హత్యాచార ఘటన జరిగి సరిగ్గా నెల రోజులవుతోంది. తొలుత బెంగాల్‌ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయగా.. ఇప్పుడది సీబీఐ పరిధిలో ఉంది. కానీ ఇంతవరకు ఈ విచారణ ఒక కొలిక్కి రాలేదు. దర్యాప్తు సంస్థకు ఈ కేసు సవాల్‌గా మారిందని తెలుస్తోంది. దీనిపై సీబీఐ అధికారి ఒకరు విూడియాతో మాట్లాడారు. నేరం జరిగిన ప్రాంతంలో తగిన ఆధారాలు లభించకపోవడంతో, ఆ ప్రభావం దర్యాప్తుపై పడుతోందన్నారు. ఆ డాక్టర్‌ మృతదేహం దొరికిన మరుసటి రోజు సెమినార్‌ హాల్‌ సవిూపంలో ఉన్న రెస్ట్‌రూం, టాయిలెట్‌ను కూల్చివేయాలని ఆర్జీ కర్‌ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌ ఆదేశించినట్లు సీబీఐ గుర్తించింది. అప్పుడే కీలక ఆధారాలు మిస్‌ అయినట్లు తాము అనుమానిస్తున్నట్లు చెప్పారు.అలాగే మృతదేహాన్ని గుర్తించిన వెంటనే సెమినార్‌ హాల్‌ వద్ద భారీగా జనం గూమిగూడినట్టుగా ఉన్న ఒక వీడియో వైరల్‌ అయింది. ఈ ఘటనకు నిరసనగా ఆగస్టు 14న అర్ధరాత్రి చేపట్టిన ఆందోళన ఆసుపత్రిలో విధ్వంసానికి దారితీసింది. ఈ రెండు సందర్భాల్లో ఆధారాలు ధ్వంసమయ్యాయా..? అనే అనుమానాలు తలెత్తాయి. కానీ కోల్‌కతా పోలీసులు అలాంటిదేవిూ జరగలేదని వెల్లడిరచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు హైకోర్టులో వేసిన పిటిషన్‌లో.. గ్యాంగ్‌ రేప్‌ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు లేవనెత్తారు. ఆధారాలు మొత్తం తారుమారయ్యాయని ఆరోపించారు.ఈ పరిణామాలన్నింటిని ఉద్దేశించి సీబీఐ అధికారి మాట్లాడుతూ..’’ఈ కేసులో తగిన ఆధారాలు లేవు. అందుకే మా అధికారులు తొందరగా ఓ కొలిక్కి రాలేకపోతున్నారు. డీఎన్‌ఏ ఫలితం, ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, పలువురిని ప్రశ్నించిన విూదట లభించిన వివరాల ప్రకారం.. ఆ డాక్టర్‌పై జరిగిన దాడిలో ఒకరికి మించిన వ్యక్తుల ప్రమేయం లేదని వెల్లడైంది. ఘటనా స్థలంలో సేకరించిన నమూనాలు.. రాయ్‌ నమూనాలతో మ్యాచ్‌ అయ్యాయి’’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. అసలైన నేరస్థుల కాపాడేందుకు సంజయ్‌ను ఇరికించారని అతడి తరఫు న్యాయవాది వాదిస్తున్న సంగతి తెలిసిందే.మరోవైపు, కేసు విచారణలో భాగంగా ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. దాంతో మాజీ ప్రిన్సిపల్‌ ఘోష్‌తో సహా మరో ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది. ఈడీ కూడా ఈ అక్రమాలను విచారిస్తోంది. ఆర్జీ కర్‌ ఆసుపత్రిలోని సెమినార్‌ రూమ్‌లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థి విగత జీవిగా కనిపించి ఉండటాన్ని గుర్తించారు. తొలుత ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ.. హత్యాచారమని దర్యాప్తులో గుర్తించారు.
లంచం ఆరోపణలు తోసిపుచ్చిన సిఎం మమతా బెనర్జీ
ఆర్‌ జీ కర్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలి హత్యాచార ఘటనలో మృతురాలి తల్లిదండ్రులకు పోలీసులు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ వస్తున్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సోమవారం కోల్‌కతాలో స్పందించారు. ఈ ఆరోపణలను ఆమె ఖండిరచారు. ఇటువంటి పని తమ ప్రభుత్వం ఎప్పుడు చేయదన్నారు. తమ ప్రభుత్వంపై వెల్లువెత్తిన ఈ ఆరోపణల వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అందులో వామపక్ష పార్టీల ప్రమేయం సైతం ఉందని ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ కుమార్తె హత్యాచార ఘటన కేసులో తాము మౌనంగా ఉండేందుకు కోల్‌కతా పోలీసులు తమకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారంటూ గత వారం మృతురాలి తండ్రి ఆరోపించారు. దీనిపై సీఎం మమతా బెనర్జీపై విధంగా స్పందించారు. చనిపోయిన వైద్యురాలి కుటుంబానికి తాను నగదు ఇవ్వాలని ప్రయత్నించలేదన్నారు. అయినా నగదు ఇవ్వడం ద్వారా ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని మాత్రం పూడ్చలేమన్నారు. హత్యాచార ఘటనతో విగత జీవిగా మారిన 32 ఏళ్ల ట్రైయినీ వైద్యురాలు చిరస్థాయిగా నిలిచి ఉండేలా.. ఆమె స్మారకార్థం ఏదైనా చేయాల్సి ఉందని సీఎం మమతా స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మృతురాలి కుటుంబ వైపునే ఉందని ఈ సందర్భంగా సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.మరోవైపు ఈ వైద్యురాలి హత్యాచార ఘటన అనంతరం రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయని గుర్తు చేశారు ఆ సమయంలో కోల్‌కతా నగర పోలీస్‌ కమిషనర్‌ పదవికి రాజీనామా చేసేందుకు ఐపీఎస్‌ అధికారి వినీత్‌ గోయెల్‌ సిద్దపడ్డారన్నారు. కానీ మరికొద్ది రోజుల్లో కోల్‌కతా మహానగరంలో దసరా ఉత్సవాలు జరగ నున్నాయని.. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలపై అవగాహన ఉన్న వ్యక్తి ఆ పదవి నుంచి వైదొలిగితే ఎలా అని ఆయన్ని ప్రశ్నించానని సీఎం మమతా బెనర్జీ ఈ సందర్బంగా వివరణ ఇచ్చారు.హత్యాచార ఘటన వెలుగులోకి వచ్చిన నాటి నుంచి పోలీసులు వ్యవహరించిన తీరుపై మృతురాలి తల్లిదండ్రులు తమ ఆకోశ్రం వివిధ సందర్బాల్లో వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. తమ కుమార్తె మృతదేహాన్ని చూసేందుకు ఆసుపత్రిలో మూడు గంటల పాటు వేచి చూడాల్సి రావడం.. మృతదేహాన్ని తమకు అప్పగించే సమయంలో ఓ సీనియర్‌ పోలీసు అధికారి నగదు తమకు ఇచ్చారని.. అయితే తాము దానిని తిరస్కరించామని మృతురాలి తండ్రి గత వారం ఆరోపించిన విషయం విధితమే.

తాజావార్తలు