బెజవాడకు చేరుకున్న కేసీఆర్..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రాలో అడుగుపెట్టారు. బేగంటపే విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో బెజవాడకు చేరుకున్నారు. అక్కడ దిగిన అనంతరం నేరుగా బాబు నివాసానికి వెళ్లారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ తో సతీమణి కాకుండా ఆర్థిక మంత్రి ఈటెల, ఎంపీ బాల్క సుమన్ లు వెళ్లారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు.. ముక్కుపుడకను కానుకగా సమర్పించాలని భావించారు. కానీ ఈ మొక్కును తరువాత సమర్పించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈనెల 23 నుంచి 27వరకూ తన ఫామ్ హౌజ్‌లో నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రుల మధ్య ఇరు రాష్ట్రాల మధ్య తక్షణం పరిష్కరించుకోవాల్సిన అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా.. కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌తో పాటు.. కొందరు రాష్ట్ర మంత్రులనూ యాగానికి ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడం ఇది రెండో సారి. దసరా రోజున అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఏపీ నుంచి వచ్చాక.. కేసీఆర్ ఈనెల 16న కర్ణాటక వెళ్లనున్నారు.