బొగ్గు ఉత్పత్తిని పెంచండి
కరీంనగర్: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న బొగ్గు కొరతనేఉ తీర్చేందుకు ఉత్పత్తిని పెంచాలని జనరల్ మేనేజర్‌లకు సింగరేణి సీఎండీ సుతీర్ఘ భట్టాచార్య సూచించారు. గోదావరిఖనిలోని సింగరేణి కార్యాలయంలో ఆయన ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రామగుండం, బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన మేనేజర్లతో పాటు, పర్చేజ్, ఇంజనీరింగ్ విభాగం అధికార్లు పాల్గొన్నారు. ప్రస్తుతం డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేదని, ఆ లోటును అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నిర్థేశిత లక్ష్యం కంటే 1.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తక్కువగా ఉందని దాన్ని పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్పత్తి పెరగకపోవడానికి కారణాలను అన్వేషించి వాటిని అధిగమించడం ద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సింగరేణి ప్రాజెక్టు ప్లానింగ్ డైరెక్టర్ బి.రమేశ్‌కుమార్, ఆపరేషన్ డైరెక్టర్ దత్తాత్రేయ, ఈ ఆండ్ ఎం డైరెక్టర్ విశ్వనాథరాఉ, కార్బొరేట్ ప్రాజెక్టు ప్లానింగ్ సీజీఎం మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు.