బొగ్గు కుంభకోణం : కేంద్రం, సీబీఐకి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. పలు ప్రైవేటు కంపెనీలకు బొగ్గు క్షేత్రాలు కేటాయిస్తూ ప్రభుత్వం మంజూరు చేసిన లైసెన్సుల రద్దు కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సైతం జస్టిస్‌ ఆర్‌.ఎం.లోధా, ఎ.ఆర్‌.దనేలతో కూడిన ధర్మాసనం వారి స్పందనకు ఆదేశించింది. అయితే లైసెన్సులపై స్టే విధించడానికి ధర్మాసనం నిరాకరించింది. ఎనిమిది వారాల్లోగా సమగ్రమైన సమాధానం దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వం, సీబీఐని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణకు జనవరి 24కు వాయిదా వేసింది.