బొగ్గు స్కాంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం
మరో రెండు కేసులు నమోదు
ఆరు నగరాల్లో సోదాలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 15 (జనంసాక్షి):
సంచలనం రేపిన బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో సిబిఐ తాజాగా మరో రెండు కేసులు నమోదు చేసింది. మరో రెండు కంపెనీలపై కేసులు నమోదు చేసిన సిబిఐ దేశవ్యాప్తంగా ఆరునగరాలలో 16 ప్రాంతాలలో సోమ వారం సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌లో ఉన్న గ్రీన్ ఇన్‌ఫ్రా, రాణిగంజ్‌లోని కమలేష్ స్టీల్స్‌లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ సహా విశాఖపట్నం, సాత్నా, జైపూర్, న్యూఢిల్లీ, రూర్కేలా నగరాలలోని పదహారు ప్రాంతాలలో సిబిఐ ఏకకాలంలో సోదాలు చేస్తోంది. ఫోర్జరీ, చీటింగ్‌తో పాటు నికరాస్తుల విలువను ఎక్కువగా చూపి బొగ్గు గనులుకాజేశారని కమలేష్ స్టీల్స్, గ్రీన్ ఇన్‌ఫ్రాలపై ఆరోపణలు ఉన్నాయి.ఈ రెండు కంపెనీలే కాకుండా దేశవ్యాప్తంగా చాలా కంపెనీలపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సెప్టెంబర్ నాలుగో తేదిన సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అప్పట్లో సిబిఐ కొన్ని చోట్ల సోదాలు చేసింది. ఆ సోదాల్లో బయటపడిన సమాచారం ఆధారంగా తాజాగా ఐదు రాష్ట్రాల్లోని ఆరు నగరాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.