బోట్లను పునరుద్దరిస్తేనే గిరిజనులకు రాకపోకలు

కాకినాడ,మే26(జ‌నంసాక్షి): గోదావరి నదిలో ఫారెస్ట్‌, టూరిజం బోట్లను నిలిపివేయడంతో మన్యంలో రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గిరిజనులకు ప్రధాన మార్గమైన గోదావరి నదిపై బోట్లను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.వాడపల్లి ప్రమాద సంఘటన నేపథ్యంలో గోదావరిలో ప్రయాణికులను దాటించే ఇంజన్‌ బోట్లను ఉన్నతాధికారుల అదేశాల మేరకు నిలిపివేశారు. కచ్చులూరు, గొందూరు, తాళ్లూరు, కొండమొదలు, పరిసర 16 గ్రామాలకు నిత్యావసర వస్తువులు కావాలన్నా, అనారోగ్యానికి గురైతే వైద్యం కోసం వెళ్లాలన్నా, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలన్నా గోదావరి నది విూదుగా ఇంజన్‌ పడవలపై ప్రయాణాలు చేయాల్సిందే. గోదావరి నదిపై తిరిగే బోట్లకు అధిక శాతం లైసెన్సులు లేవని, భద్రతా కారాణాల రీత్యా నిషేదాజ్ఞలు విధించారు. దీంతో 16 గ్రామాల ప్రజలు ఆయా పనులపై బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో నిత్యావసరాలు నిండుకుని

ఇబ్బందులకు గురవ్వాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. దేవీపట్నం వద్ద ఫెర్రీ ఇంజన్‌ పడవను కూడా అధికారులు తిరగనివ్వకపోవడంతో రెండు రోజుల నుంచి వందలాది మంది కొండమొదలు పరిసర గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.